Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

772

కథాసరిత్సాగరము. లం. 8. త. 3

సూర్యప్రభుఁడు 'బ్రహ్మాది దేవత లందఱు అడ్డపడి రక్షింప వచ్చినను నిశ్చయముగా నేను వరదారాపహరణమందు కపట ప్రాగల్భ్యము కలవానిని ఆ శఠుని శ్రుతశర్మను నిర్మూలము చేయవలసినదియే' యని ప్రతిజ్ఞచేసి, అతనిమీఁదికి వెడలు వాఁడై, వెంటనే గణకులు ఏడవదినమందు మంచిలగ్నము నిర్ణయింపఁగా, ఆలగ్నమున బయలుదేఱుటకు నిశ్చయించుకొనెను విజయార్థము పయనము సమకట్టి యున్న యా సూర్యప్రభుని మఱియు దృఢపఱిచి మయుఁ డిట్లనియె - 'నిశ్చయముగా నీవు విజయమునకు పోవువాఁడవే యేని చెప్పెదను వినుము. ఆకాలములో నేనే మాయను ప్రయోగించి నీప్రియలను గొనిపోయి పాతాళములో దాఁచితిని. అట్లయిన నీవు త్వరగా విజయోద్యమము చేయుదు వని. గాలి తోడ్పడిన మండినట్లు అగ్ని స్వయముగా మండదు గదా. కనుక పాతాళమునకు పోదము రా, నీప్రియలను నీకు చూపెదను.' మయుఁ డిట్లు చెప్పఁగా అచటి వారందఱును మిగుల సంతోషించిరి. అంతట ఆ మొదటి బిలముగుండనే అందఱును మయాసురునివెంబడి నాలవపాతాళమునకుఁ బోయిరి.

అచట నొక పడుకటిల్లు తెఱచి మయుఁడు అం దున్న మదనసేనాది భార్యలను సూర్యప్రభునికి సమర్పించెను. వారిని అసురాత్మజ లయిన తన యితర భార్యలను గ్రహించి సూర్యప్రభుఁడు మయునిబోధనచే ప్రహ్లాదుని దర్శింపఁ బోయెను.