Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

746

కథాసరిత్సాగరము. లం. 8. త. 2

పుఁడు.' ఆమాట విని అచటఁ గూడియున్న సప్తపాతాళపతులు వల్లె యని ప్రతిజ్ఞ చేసిరి. సునీథుఁడు మరల లభించినందులకు బలియు అచట ఉత్సవము చేసెను.

ఈలోపల నారదముని వచ్చి అర్ఘ్యపాద్యములు పొంది ఆసీసుఁడై దానవులతో నిట్లనియె:- 'నన్ను ఇంద్రుఁడు ఇటకు పంపినాఁడు. సునీథుఁడు బ్రదికినందులకు తనకు పరమసంతోషమనియు, ఇపుడు మరల నిష్కారణముగా మీరు వైరముపూన వల దనియు, తన యాశ్రితుఁ డయిన శ్రుతశర్మమీఁద ద్వేషింప వల దనియు, ఇంద్రుఁడు మీకు తెలుపుచున్నాఁడు.' నారదుఁడు ఈయింద్రసందేశమును ముగింపఁగా, ప్రహ్లాదుఁడు పలికెను. 'ఇంద్రునికి సునీథుఁడు బ్రదికినందులకు తృప్తిగా కేమి? అకారణవిరోధము మేము చేయము. ఇప్పుడే గురువు నెదుట ప్రతిజ్ఞ చేసి యున్నాము. శ్రుతశర్మ తనకు సహాయులున్నారు గదా యని బలాత్కారముగా మాకు విరోధము చేయుచున్నాఁడు. మాయందు దోష మేమి? సూర్యప్రభునికి తదారాధన ప్రసన్నుఁ డయిన శంకరుఁడు ముందే ఈపదమును అనుగ్రహించి యున్నాడు. ఈశ్వరుఁడు ఆజ్ఞాపించిన యీ కార్యమందు మే మేమి చేయఁగలము? కనుక ఇంద్రుఁడే నిష్కారణముగా అనుచితములు పలుకుచున్నాఁడు. ' ఇట్లు దానవేంద్రుఁడు ప్రహ్లాదుఁడు పలుకఁగా, అ దంతయు సరియే యని, ఇంద్రునే నిందించి నారదముని అదృశ్యుఁ డాయెను