Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

742

కథాసరిత్సాగరము. లం. 8. త. 2

మందు పవ్వళించి నిద్రితుఁడుంబోలె నున్నట్టి వానిని చూచిరి. 'ఇందులో ప్రవేశింపుము. ఇదియే నీపూర్వదేహము, దీనిచుట్టు నుండు వీరు నీ పూర్వభార్యలు. 'అని మయుఁడు పలుకగా ఆ రాజు మయుఁడునేర్పిన యోగముచే తన దేహమును వదలి ఆదానవ దేహము చొచ్చెను. అంతట శయనములోని పురుషుఁడు ఆవులించి మెల్లమెల్లగా కన్నులు తెఱచి నిద్రమేల్కొన్న వాఁడుంబోలె పడకనుండి లేచెను. అంతట అసురాంగనలుసు సంతోషించి 'ఆహా మాప్రాణనాథుఁడు సునీథుఁడు బ్రదికినాఁడు' అని కేకవేసిరి. ప్రాణహీనమై పడిపోయిన చంద్రప్రభ దేహమును చూచి సూర్యప్రభాదు లందఱును దుఃఖితు లైరి. సునీథుఁడును సుఖనిద్రనుండి మేలుకొన్నవాఁడుం బోలె లేచి తన తండ్రిని మయుని చూచి పాదముల వ్రాలి నమస్కరించెను. తండ్రియు అతనిని కౌఁగిలించుకొని ఎల్ల వారియెదుటను 'పుత్త్రా, నీ విప్పుడు రెండు జన్మములను స్మరించుచున్నావా ? అని యడిగెను. అతఁడు 'స్మరించుచున్నాను' అని పలికి చంద్రప్రభసునీథ జన్మములయొక్క వృత్తాంతములను చెప్పి, కీర్తిమతీదేవిని సూర్యప్రభాదులను పూర్వభార్య లయిన దనుజాంగనలను ఒకరొకరిని పేర్కొని ఓదార్చెను. ఎప్పటికైన పనికివచ్చు నని చంద్రప్రభ దేహమును మయుఁడు ఆజ్యౌషధులచేత కాపాడి యుంచెను. అతనికి స్మృతి యున్నందు కై సూర్యప్రభాదులు సంతోషించిరి.