దమయంతి కథ.
1007
మునుగూడ హరించుకొని పోయినవి.' అని ఆకాశమునుండి నలునికి వాక్కు వినఁబడెను అంత నారాజు దుఃఖితుఁ డై ఏకవస్త్రుఁ డై కూర్చుండి దమయంతీదేవికి విదర్భ నగర మార్గమును చూపించెను. 'ప్రియా, ఈదారి విదర్భదేశమునకు నీతండ్రి యింటికి నడచును. ఇది అంగదేశమునకు దారి. ఇది కోసలమునకు దారి.' ఆ మాటలు విని దమయంతి 'ఆర్యపుత్త్రుఁడు నన్ను వదలివేయ నున్నాఁడు కాఁబోలును, కాదేని ఈమార్గముల నేల చూపును?' అని భయపడెను. వారు ఆవనములో ఫలము లారగించి రాత్రి కుశశయనమున పరుండిరి. దమయంతి దారి నడచినబడలికచే త్వరలో ఒడ లెఱుఁగక నిద్ర పోయెను. నలుఁడు కలిమోహితుఁ డై నిద్రపోక దమయంతిని ఎడఁబాయ నుద్యోగించి దమయంతియొక్క వస్త్రార్ధమును తఱిగి తాను చుట్టుకొని ఆమెను విడనాడి వెడలిపోయెను.
దమయంతి రాత్రియెల్ల నిద్రించి మేల్కొని పతినిగానక, తన్ను వదలి పోయె నని తలంచి విలపింపఁ దొడంగెను. 'హా! ఆర్యపుత్త్రా, మహాసత్త్వా, శత్రువులయందును దయగలవాఁడా, మద్వత్సల, ఎవరు నిన్ను నాపై నిష్కరుణునిఁ గావించిరి ఒంటరిగా కాలినడకచే అడవులలో ఎట్లు తిరుగుదువు ? ఎవరు నీకు శ్రమాపనోదనార్థము పరిచర్య చేయుదురు? రాజులమౌళి మాలాపరాగములచే రంజితము లయిన నీపాదములను దారిలో ఇప్పుడు ధూళి కలుషము చేయుచున్నది గదా ! హరిచందన