Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1002

కథాసరిత్సాగరము. లం. 9. త. 6

హంసయు దమయంతికడకుఁ బోయి ఆమెకు ఆవృత్తాంతమును చెప్పి యథాకామముగా పోయెను.

దమయంతియు యుక్తిగా తల్లిచే నలప్రాప్తికై స్వయంవరము చాటు మని తండ్రిని వేఁడించెను. అతఁడును అంగీకరించి లోక మెల్ల సకలరాజులను పిలుచుటకు దూతలను పంపెను. రాజు లెల్లరును విదర్భనగరమునకు స్వయంవరార్థము పోవుచుండిరి. నలుఁడును రథమెక్కి తరలి పోవుచుండెను. ఆ సమయమున ఇంద్రాదిలోకపాలురు నారదమునివలన దమయంతీ స్వయంవరమును ఆమెకు నలునిపైఁ గూర్మియు వినిరి. ఇంద్ర వాయు య మాగ్ని వరుణులు కలయఁబలికికొని దమయంతీ బద్ధమానసు లై విదర్భనగరమునకుఁ పోవుచున్న నలునికడకు వచ్చి ప్రణతుఁడైన యతనితో "రాజా, నీవు పోయి మామాటగా దమయంతితో 'మాయేవురలో ఒకనిని వరియింపుము. మరణ ధర్ముఁ డయిన మనుష్యుని ఏల కోరేదవు? మేము అమరులము.' అని పలుకుము. మావరముచే నీవు ఇతరులకు అగపడకయే ఆమెయొద్దకు పోవుదువు.” అని కోరిరి. నలుఁడును అంగీకరించి ఆప్రకారమే అదృశ్యుఁడై అంతఃపురము చొచ్చి దమయంతితో ఆ దేవాజ్ఞను విన్నవించెను. ఆ సాధ్వి విని 'సరియే, దేవతలు గొప్పవారే, అయినను నేను వారలను కోరను. నాకు నలుఁడే భర్త.' అని పలికెను ఆమె యిట్లు నిశ్చయముగా చెప్పఁగా నలుఁడు ఆమెకు తన్ను తెలుపుకొని. ఇంద్రాదులకడకు వచ్చి,