చంద్రప్రభుఁడు సునీథదేహముం జొచ్చుట.
737
అతనిమాట ప్రకారమే మఱునాఁడు చంద్రప్రభుఁడు సకలరాజులను తోడ్కొని ఐరావతీచంద్రభాగల సంగమమునకు పోయి, అచట వెలుపల రాజులను ఉంచి, సూర్యప్రభుని యంతఃపురములను వారికి అప్పగించి, నీళ్లలో మయుఁడు చూపిన బిలములో సూర్యప్రభునితోను దేవితోను సిద్ధార్థాది మంత్రులతోను ప్రవేశించి, బహుదూరము పోయి ఒకదివ్య దేవాలయము చూచి అందఱతోను అందులోపలికి పోయెను. ఇంతలో వెలుపలనున్న రాజులమీఁదికి విద్యాధరులు ఆకాశము నుండి వచ్చి వారిని తమవిద్యలచే స్తంభితులను చేసి సూర్యప్రభుని భార్యలను చెఱ గొనిపోయిరి. ఆక్షణములో ఆకాశమున 'ఓరి శ్రుతశర్మా, పాపాత్ముఁడా, చక్రవర్తియొక్క యీ భార్యలను తాఁకితివేని తత్క్షణమే సైన్యములతోఁగూడ చత్తువు. కనుక వీరిని నీవు తల్లులనుగా చూచుచు గౌరవముతో రక్షించు చుండుము. ఇప్పుడే నిన్ను చంపి వీరి నేల విడిపింప ననఁగా, ఇందులకు కారణము గలదు. నీయొద్దనే ఉందురు గాక' అని దివ్యవాక్కు వినఁబడెను. అంతట విద్యాధరులు అదృశ్యు లైరి. ఆ రాణివాసములను కోలుపోయిన యవమానమునకు వీరభటాదిరాజులు ప్రాణత్యాగముచేయుటకై ఒండొరువులతో పోర సమకట్టిరీ. 'మీ కొమారితలకు నాశము లేదు, వారిని మీరు మరల కలసికొనియెదరు. సాహసము చేయకుఁడు. మీకు మేలు కలుగును.' అని పలికి ఆకాశవాణి వారియత్నమును మాన్పెను.