మహీపాలుని కథ.
989
అతఁడు ఆ యుత్పలమును గ్రహించి తెల్లవాఱఁగానే తరలి అటనట తిరిగి తారాపురము చేరెను. అందు ఇతని పుత్త్రుఁడు మహీపాలుఁడును పుత్త్రికయు అనంతస్వామి యను మంత్రియింట నున్నారు గదా. ఆ మంత్రి అతిథిప్రియుఁ డని చంద్రస్వామి విని, అతని యింటికే పోయి, ద్వారమందు అధ్యయనము చెప్పుచుండెను. ప్రతీహారుఁడు నివేదింపఁగా మంత్రి చంద్రస్వామిని దర్శనమాత్రముననే విద్వాంసునిఁగా నెఱింగి భోజనార్థము నిలువు మనెను. అట్లు నిమంత్రితుఁ డై చంద్రస్వామి స్నానార్థమై పాపహర మైన యనంతహ్రదమునకు పోయెను. స్నానమై వచ్చు నాతనికి మార్గమందు నగరమంతటను 'అయ్యో! అయ్యో!' అని ఏడ్పు వినఁబడెను. కారణ మితఁ డడుగఁగా జనులు చెప్పిరి. 'ఇచట మహీపాలుఁడని బ్రాహ్మణ పుత్త్రుఁడు, అడవిలో సార్థహరుఁ డను సార్థవాహునికి దొరికినవాఁడు, అతనివల్లనుండి అనంతస్వామిచే చెల్లెలితోఁగూడ సులక్షణుఁ డని గ్రహింపఁబడి పిల్లలు లేమిచే, పెంచుకొనఁబడినవాఁడు, తన సద్గుణములచే తారావర్మ రాజునకేగాక ఈ రాష్ట్రమున కంతటికి ప్రియమైనవాఁడు, ఇప్పుడు నల్లత్రాఁచువాతఁ బడినాఁడు. అందులకై యీ నగర మెల్ల ఇట్లు ఘోషిల్లుచున్నది.' ఈ మాట విని, వాఁడే తన కొమరుఁ డని తలంచి, చంద్రస్వామి శీఘ్రముగా మంత్రియింటికిపోయి, అచట నెల్లవారును చుట్టుకొని యుండఁగా సుతుని చూచి, దేవీదత్త