Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

970

కథాసరిత్సాగరము. లం. 9. త. 5

ములచేత మూర్తీభవించిన దుఃఖము చేతనుంబోలె అతనిం దడుపుచు ప్రసన్నయై కంఠాలింగనము చేసెను. రాజు సంతుష్ఠుడై కుపితతుష్ట యయిన యామెతో ఆరాత్రి భోగములఁ గడపి నిద్రించెను. స్వప్నములో ఆరాజునకు వికృతస్త్రీ ఒకతె అగపడి యతనిమెడనుండి ఏకావళిని శిరస్సునుండి చూడారత్నమును హరించెను. అంత నానాప్రాణ్యంగదేహుఁడు బేతాళుఁడు అగపడి రాజుతో బాహుయుద్ధము చేయందొడంగెను; రాజు వానిని నేలఁ గూల్చెను; వాఁడు రాజును వీపుపై నెక్కించుకోని పక్షివలె ఆకాశమార్గమునఁ బోయి సముద్ర మధ్యమున విడిచి పెట్టెను ; రాజు ఎట్టకేలకు అందునుండి గట్టు చేరెను; అంత మరల కంఠమున ఏకావళియు శిరమున చూడామణియు ఉండెను - ఇట్లు కల గని మేలుకొని తెల్లవాఱఁగా తన యొద్దకు పరిచితుఁడు ఒక క్షపణకుఁడు రాగా రాజు అతని ఆస్వప్నమునకు ఫల మడిగెను. 'అప్రియము చెప్ప రాదు. అడిగినప్పుడు చెప్పక యె ట్లుందుసు ! ఏకావళీ చూడామణులు నష్టమగుటచేత దేవితోను పుత్త్రునితోను నీకు వియోగము కలుగును. సముద్రమును దాఁటఁగానే నీకు మరల ఏకావళీ రత్నములు కలుగుటవలన దుఃఖాంతమందు నీకు మరల దేవీ పుత్త్ర సమాగమము కలుగును.' అని క్షపణకుఁడు పలుకఁగా, ఆలోచించి రాజు 'ఇంతవఱకు నాకు కుమారుఁడు లేఁడు; కుమారుఁడు కలుగును.' అని వచించెను. ఆసమయమున వచ్చిన