Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనకవర్షుని కథ.

961

కనకవర్షుని కథ.

ఇట్లు కథ చెప్పి ఆఖ్యానప్రవీణుఁడు గోముఖుఁడు మరల వత్సరాజసుతాదేశమున వక్కాణింపఁ దొడంగెను. పూర్వము గంగాతటములో మంచిపరిపాలనలో కనకపుర మని ఒక నగర ముండెను. అందు బంధంబులు కవివాక్కులయంద, ఛేదములు పత్త్రములయంద, భంగములు నార్యలకములయంద, ఖరావళి సస్యసంగ్రహణములయంద. అందు వాసుకితనయుఁ డైన ప్రియదర్శనుఁ డనువానికి యశోధర యను రాజపుత్త్రియందు ఉద్భవించినవాఁడు కనకవర్షుఁ డను రాజు ఏలుచుండెను. అతఁడు సర్వభూభారమును మోచువాఁ డయ్యును అశేషగుణభూషితుఁ డయి యుండెను. యశస్సునందు లుబ్ధుఁడు గాని ధనమందుఁ గాఁడు, పాపములకు వెఱచును గాని శత్రువులకు వెఱవఁడు, పరాపవాదములయందు తెలియనివాఁడుగాని శాస్త్రములలో తెలియనివాఁడు గాఁడు. అల్పత్వము ఆమహాత్ముని కోపమందే గాని ప్రసాదమందు లేదు, బధ్ధముష్టిత్వము చాపమందే గాని దానమందుఁ గాదు. అఖిల జగ ద్రక్షకుని అతనిని చూచిన మాత్రాన అబలాజనములు మారవ్యథాకులము లగుచుండెను. అతఁ డొకనాఁడు సోష్మంబు ఉన్మదవారణము రాజహంసపరీవారము సోత్సవానందితప్రజంబు నై ఆత్మతుల్యగుణ మైన శరత్కాలమున కమలామోదము వెదచల్లుచు చల్లగాలి వీచుచున్న చిత్రప్రాసాదమును క్రీడార్థము ఎక్కెను.