ఇంద్రుఁడు చంద్రప్రభునికడకు దూత్యము పంపుట.
733
మహేశ్వరుఁడు దాత యయినచోట ఇతరుని కెవనికి ఏమియధికారము కలదు? హిరణ్యాక్షునికి జ్యేష్ఠాగత మయిన యింద్రత్వము ఎట్లు తప్పింపఁబడినది ? మేము శత్రుత్వమును పూనుచున్నా మనియు అధర్మములోఁ బ్రవేశించుచున్నా మనియు చెప్పుచున్నాఁడు గదా, అదియు పొరఁబాటు, అతఁడే మా ప్రయోజనమందు మాపై బలాత్కారముగా ద్వేషము వహించుచున్నాఁడు. మేము శత్రువును జయింపఁ జూచుచున్నాము మునిభార్యను హరింపలేదు, బ్రహ్మహత్య చేయలేదు, మాకు అధర్మ మెక్కడిది ? అశ్వమేధము చేయమియు దేవతలను తిరస్కరించుటయును ప్రస్తావించుచున్నాఁడు గదా. రుద్రయజ్ఞము చేసినచోట ఇతర యజ్ఞమువలన ఏమి ప్రయోజనము? దేవదేవేశుఁ డయిన శంభువును ఆరాధింపఁగా ఏదేవుని అర్చించి నట్లు గాదు ? రుద్రునియందు మాత్రము భక్తియుంచి ఇతర దేవతలను సరకు గొనమి ఉచితము గా దనుచున్నాఁడు గదా, అది పొరఁబాటు ! హరుఁడు వెలుంగుచోట ఇతర దేవసమూహములవలన ఏమి పని ? సూర్యుఁడు ఉదయింపఁగా ఇతర జ్యోతిస్సులు వెలుంగునా? మహామునీ, ఇది సర్వమును నీవు ఇంద్రునికి చెప్పవలయును. మేము మాకు ప్రస్తుత మయిన దానిని చేయుచుండెదము అతనికి తోఁచినట్లు అతఁడు చేయును గాక.”
ఇట్లు మయాసురుఁడు పలుకఁగా నారదుఁడు వల్లె యని యా ప్రతిసందేశమును గ్రహించి యింద్రునియొద్దకు పోయెను.