Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

950

కథాసరిత్సాగరము. లం. 9. త. 4

పుణ్యాత్ముఁడు దుఃఖము లనుభవించినను తప్పక సుఖ మనుభవించును.

ఇట్లు గోముఖుఁడు చెప్పఁగా అంగీకరించి నరవాహనదత్తుఁడు సభ చాలించి, స్నానాది దివస కృత్యములకై లేచెను.

సమరతుంగుని కథ.

మఱునాఁడు నరవాహనదత్తుఁడు ఆస్థానమున నుండఁగా బాలసేవకుఁడు సమరతుంగుఁ డను రాజపుత్త్రుఁడు 'దేవా, నాదేశమును సంగ్రామవీరుఁ డను నాదాయాది వీరజితుఁడు మొదలగు తన నలువురు పుత్త్రులతోఁగూడి నాశము చేసినాడు. నేను పోయి ఆయేవురను పట్టి కట్టి తెచ్చెదను. దీనిని యేలినవారు ఎఱిఁగి యుండవలయును.' అని విన్నవించి పోయెను. అతనిదండు కొంచె మనియు పరులసైన్యము అధిక మనియు విచారించి వత్సరాజసుతుఁడు వానితోఁ గూడ తన బలమును పంపెను. అతఁడు పరువుచే ఆదండును తోడుకొనకయే పోయి ఆయేవురను తన బాహుమాత్రముచేతనే రణములో జయించి కట్టి తెచ్చెను. అట్లు నచ్చిన యావీరుని ప్రభువు సమ్మానించి, 'చిత్రము! ఆక్రాంతవిషయులను సబలులను ఇంద్రియోపములను ఏవురను శత్రువులను జయించి యితఁడు పురుషార్థమును సాధించినాఁడు.' అని పొగడెను. 'దేవా, ఇట్టికథను ఇంతవఱకు విని యుండని యెడల, చమరవాల మహారాజు కథను చెప్పెదను వినుము.’ అని గోముఖుఁడు ఇట్లు చెప్పసాగెను.