Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

732

కథాసరిత్సాగరము. లం. 8. త. 2

యాదేశముచేతను మయాసురుని తోడ్పాటుచేతను సర్వవిద్యాధరచక్రవర్తి పదమును సాధింపఁ జూచుచున్నా రను సంగతిని నే నెఱుంగుదును. మీ రట్లుచేయఁ గూడదు. ఆ యధికారమును మేము శ్రుతశర్మకు ఇచ్చినారము. విథ్యాధరవంశాంభోధిచంద్రుఁ డైన యతనికి అది వంశక్రమాగతము గదా. మాకు విరుద్ధముగా మీరు ఏమిచేసినను దానివలన మీకు వినాశమే కలుగును పూర్వము నీవు రుద్రయజ్ఞము చేయువాఁడ వై ముందుగా అశ్వమేధము చేయు మని నేను బోధింపఁగా నామాట చేయ వైతివి. అట్లు దేవతలను లక్ష్యపెట్టక రుద్రుని మాత్రము ఆశ్రయించి మీరు చేయుపని మీకు మేలునకు గాదు.' అని ”

ఇ ట్లని నారదమహాముని ఇంద్రసందేశమును చెప్పఁగా నవ్వుచు మయాసురుఁ డిట్లనియె: - "మహామునీ, ఇంద్రుని మాట ఉచితము గాదు. సూర్యప్రభుఁడు మర్త్యమాత్రుఁ డని ఇంద్రుఁడు పలుకుచున్నాడు గదా! ఆ మర్త్యత్వము ఎట్టిదో దామోదరునితోడి యుద్ధములో ఇంద్రుఁడు చూడలేదా ! ఆ మర్త్యత్వము వలన అతని కేమి లోపము ? మర్త్యులే సత్త్వవంతులు, అన్ని సిద్ధులకు అధికారులు. పూర్వము నహుషాదులు ఇంద్రపదమును సాధింపలేదా ! తాను ఈసామ్రాజ్యమును శ్రుతశర్మకు ఇచ్చినట్లును, అది అతనికి క్రమాగత మనియును, ఇంద్రుఁడు పలుకుచున్నాఁడు గదా. అదియు అయుక్షమే.