Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుద్రసెట్టికథ.

945

దత్తుఁడు నన్ను భూలోకములో అమరావతినిగా చేసినాడు!' అనుసంతసమునం బోలె సిందూరము చల్లుచు రక్తపతాకల నాడించుచు నొప్పారుచుండెను. పిమ్మట నరవాహనదత్తుఁడు తనకై ఎదురు సూచుచుండిన తన భార్యలను సంభావించెను. వారు ఆ నాలుగు దినములను నాలుగు సంవత్సరములుగాఁ గడపిన తమ విరహవేదలను వర్ణించి అతనిని సంతోషపెట్టిరి. గోముఖుఁడు వనవాసములో రథాశ్వములను కాపాడుచుండిన ప్రలంబబాహువుయొక్క సింహాది వధ శౌర్యమును వర్ణించెను. ఇట్లు శోత్రపేయము లగు సల్లాపములను వినుచు నయనామృత మగు కాంతల రూపమును చూచుచు, చాటుకారుఁ డయి సచివసమేతుఁడై మధుపానము సేయుచు, నరవాహనదత్తుఁడు ఆకాలమును సుఖముగాఁ గడపు చుండెను.

రుద్ర సెట్టి కథ.

ఒకనాఁడు అతఁడు వయస్య సమేతుఁ డై అలంకారవతీ వాసగృహస్థుఁ డై వెలుపల వాద్యముల మ్రోఁతను విని 'ఏల ఇచట ఆకస్మికముగా తూర్యములు మ్రోఁగు చున్నవి?' అని తన సేనాపతిని హరిశిఖుని హెచ్చరించెను. అతఁడును తత్క్షణమే పోయి తెలిసికొని వచ్చి యిట్లు విన్నవించెను: 'దేవా ఈనగరములో రుద్రుఁ డని వర్తకుఁ డున్నాడు. అతఁడు ఇట నుండి బేహారమునకై సువర్ణద్వీపమునకు పోయి యుండెను.