Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీహరి నలువు రచ్చరల నిచ్చుట.

941

భూమి పాదములని ఆకాశము శిర మని దిక్కులు శ్రోత్రములని సూర్యచంద్రులు నేత్రము లని బ్రహ్మాండము జఠర మని నీవు అనిర్వచనీయుఁడ వని పెద్దలు వర్ణింతురు. దేవా, ధామనిధివైన నీవలననుండి యీ భూతగ్రామము మండుచున్న యగ్నినుండి స్ఫులింగసంఘాతమువోలె పుట్టుచున్నది. సాయంకాలమున పక్షిసంఘము వాసవృక్షమునుంబోలె ఈ భూతసంఘాతము ప్రళయకాలమందు మరల నిన్నే చొచ్చుచున్నది. నీవే ఉల్లసితుఁడవై నీయంశములనే ఈ లోకేశ్వరులనుగా అనంత వేలాక్షుభిత మయిన సముద్రము తరంగములనుబోలె సృజించు చున్నావు. నీవు విశ్వరూపుఁడ వయ్యును అరూపుఁడవు, విశ్వకర్మ వయ్యును అకర్మవు; విశ్వాధారుఁడ వయ్యును అనాథారుఁడవు, నీతత్త్వమును ఎవఁడు ఎఱుఁగ నేర్చును? నీకటాక్షముచే దేవతలు ఆ యా సంపదలను పొందిరి. నన్నును కరుణాపూర్ణ కటాక్షముతో చూడుము.’

ఇట్లు పొగడుచున్న నరవాహనదత్తుని శ్రీహరి ప్రసాదపూర్ణ కటాక్షమునఁ జూచి నారదునితో 'మహామునీ, మున్ను పాల సముద్రమునుండి పుట్టిన యే నా కలికి యచ్చరలను నేను ఇంద్రుని యొద్ద ఇల్లడ యుంచితినో వారిని అతని యొద్దనుండి నామాటవలన అతని రథములోనే ఎక్కించి త్వరితముగా ఇచటికి కొనితెమ్ము.' అనియె. అంతట నారదుఁడు వల్లె యని పోయి ఆయచ్చరలను ఇంద్రరథమున మాతలి సమేతుఁడై