వీరవరుని కథ.
937
నాప్రాణమును కాపాడినయితనికి ఏమి ప్రత్యుపకారము నేను చేయఁగలను ! ఈరీతిగా తలపోసి రాజు మేడదిగి లోపలికి పోయి ఆశ్చర్యమగ్నుఁడయి రాత్రిని గడపి తెల్లవాఱఁగానే ఆస్థానమందు అందఱయెదుటను వీరవరుని రాత్రి చరితాద్భుతమును అతఁ డుండఁగానే వక్కాణించెను. ఎల్లరును వీరవరుని పొగడుచుండఁగా, రాజు అతనికి సపుత్త్రునికి పట్టముగట్టి, పెక్కు దేశములు గుఱ్ఱములు రత్నములు ఏనుఁగులు పదికోట్ల సువర్ణములు అఱువదియింతల జీతమును ఇచ్చెను. తత్క్షణమే వీరవరుఁడు సకుటుంబముగా ఉచ్ఛ్రితాతపత్రుఁ డై రాజతుల్యుఁ డై కృతార్థుఁ డాయెను.
ఇట్లు కథ చెప్పి ముగించుచు గోముఖమంత్రి నరవాహనదత్తునితో మరల నిట్లనియె: 'దేవా, ఇట్లు స్వామికొఱకు దేహాపేక్ష వదలినవా రయి రెండు లోకములను తమ సత్త్వ మహిమచే జయించునట్టి యేకవీరు లగు భృత్యులు రాజులకు ఎక్కడనో పుణ్యవిశేషముచే దొరకుదురు. స్వాకృతియు మహాసత్త్వుఁడును అయిన యీక్రొత్తవాఁడు నీసేవకుఁడు బ్రాహ్మణవీరుఁడు ప్రలంబబాహువు కూడ అట్టివాఁడు గానే అగపడుచున్నాఁడు.' - మతిమంతుఁ డైన యామంత్రివలన ఈకథ విని మహోదారుఁడు రాజపుత్త్రుఁడు మిగుల సంతోషించెను.