Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

932

కథాసరిత్సాగరము. లం. 9. త. 3

భూదేవి 'ఓరీ, రాచనగరి చెంత చండికాదేవి యున్నది గదా, ఆమెకు తత్క్షణము నీపుత్త్రుని బలి యిత్తువేని రాజు బ్రతుకును. వేఱే ఉపాయము లేదు.' అనెను. వీరవరుఁడు 'అమ్మా, ఇప్పుడే అట్లు చేసెదను.' అనెను. 'నీవలె స్వామిహితము చేయువాఁడు మఱి యెవఁడు ? పో, నీకు మేలు కలుగును గాక' అని పలికి భూదేవి యంతర్హితురా లాయెను. చెంత నున్న రాజు సర్వమును వినుచుండెను పిమ్మట విక్రమతుంగుఁడు వెంట ప్రచ్ఛన్నముగా వచ్చుచుండఁగా, వీరవరుఁడు ఆ నిశీథమందు ఇంటికిపోయి భార్యను ధర్మవతిని నిద్రలేపి భూదేవిమాటఁబట్టి రాజుకై తనపుత్త్రుని చండికి బలి వేయవలయు నని ఆమెతో చెప్పెను. ఆమెయు 'స్వామిహితము ఆవశ్యకము; కావున పుత్త్రుని లేపి చెప్పుము.' అనెను. అంతట బాలుని లేపి వానితో వీరవరుఁడు 'రాజుకొఱకు భూదేవి మాటప్రకారము నిన్ను బలివేయ వలసి యున్నది' అని చెప్పెను. ఆ మాట విని యన్వర్థనాముఁడు ఆ బాలుఁడు సత్త్వవరుఁడు 'నాయనా, నా ప్రాణము ప్రభు కార్యమునకు ఉపయోగపడునేని పుణ్యవంతుఁడను కానా! నేను ఎవరి యన్నముభుజించితినో, ఆఋణము తీర్చుకొనవలయును. కావున నన్నుఁ గొనిపోయి ఆయనకొఱకు చండీదేవికి బలి యిమ్ము.' అనెను. అందులకు వీరవరుఁడు 'నీవు సత్యముగా నా కుమారుఁడవే.' అని సంతోషముతోఁ పలికెను. ఇది యెల్ల బయటనుండి విని విక్రమతుంగుఁడు ' ఆహా ! వీ రెల్ల సమానసత్త్వులు!' అని