వీరవరుని కథ.
931
బురదలో నెట్లుందును!' ఈవిలాపములు విని ఇంద్రుఁడు వచ్చి వానిని దుఃఖహేతు వడిగెను. అతఁడును చెప్పెను. అంతట నింద్రుఁడు “అందులకు ఉపాయమున్నది వినుము. 'ఓం నమః శివాయ' యని జపించుచు ఈశ్వరుని శరణు చొరుము. ఆతని శరణుఁ జొత్తువేని నీ పాపమును పో నడఁచి పుణ్యము పొందుదువు. దానిచే పందికడుపునఁ బుట్టవు. స్వర్గమునుండి పడిపోవు.” అని యుపదేశించెను. అంత సుప్రభుఁడు వల్లె యని 'ఓం నమః శివాయ' యనుచు శంభుని శరణుఁజొచ్చెను. తన్మయుఁ డై ఆఱుదినములకు అతఁడు శివప్రసాదముచేత సూకరీగర్భమును తప్పించుకొనుటయే గాక, స్వర్గమునుం గూడ దాఁటి పైకి పోయెను. ఏడవనాఁడు వానిని స్వర్గమునం గానక యింద్రుఁడు పైలోకమునకు పోయె నని యెఱింగెను. సుప్రభుఁడు ఈరీతిని తనకు రాఁబోవునమంగళమును కనినయట్లే నేనును రాజునకు రా నున్న మృత్యువును ఎఱింగి దుఃఖించుచున్నాను.
భూదేవి యిట్లు పలుకఁగా వీరవరుఁడు 'అమ్మా, ఇంద్ర వచనమున సుప్రభునికి ఉపాయము కలిగినట్లు రాజునకును రక్షోపాయము ఉన్నం జెప్పుము.' అని యడిగెను. 'ఒకటియే ఉపాయ మున్నది, అది నీకే స్వాధీనము.' అని పృథివి పలికెను. 'అట్లయిన త్వరగా చెప్పుము దేవీ. నా ప్రాణములచేతఁ గాని నా భార్యాపుత్త్రుల ప్రాణములచేతను గాని రాజు బ్రదుకునేని నాజన్మము సఫల మగును ' అని వీరవరుఁడు చెప్పెను. అంత