Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరవరుని కథ.

929

నిత్యము చారులు తెలియఁ జేయుచుండిరి. వీరవరుఁడును ఆరీతిని స్నానాది సమయములఁ దక్క దివానిశము రాజ ద్వారమందు ఆయుధపాణి యై నిలిచి యుండెను.

ఇట్లుండఁగా వీరవరుని జయింపఁ గోరియుంబోలె శూర ప్రతాపమును సహింపక గర్జితోగ్ర మయి ఘనాగమము వచ్చెను మేఘము ఘోరముగా ధారాశరావళులను వర్షించుచుండఁగా వీరవరుఁడు సింహద్వారమున స్తంభమో యన కదల కుండెను. విక్రమతుంగుఁడు ఆతనిని పలుమాఱు మేడనుండి చూచి రాత్రి అతనివృత్తమును తెలియఁ గోరి మేడ యెక్కెను. 'ఎవరు సింహద్వారములో?' అని రాజు కేక వేసెను. 'నేను ఉన్నాను.' అని వీరవరుఁడు ఉత్తరము చెప్పెను. 'ఆహా! ఇతఁడు మహా సత్త్వుఁడు, గొప్పస్థితికి తగినవాఁడు; ఇట్లు వర్షించుచున్నను సింహద్వారమును ఎడఁబాయఁడు?' అని రాజు తలపోయుచుండఁగా దూరమున ఒక స్త్రీ యేడ్పు వినఁబడెను. 'నారాష్ట్రములో దుఃఖితులు లేరు. ఈమె యెవరు? ఎందులకు ఏడ్చుచున్నది?' అని యాలోచించి రాజు వీరవరుని 'వీరవరా, ఎవతెయా ఒకస్త్రీ దూరమున ఏడ్చుచున్నది విను. ఆమె ఎవరో, ఆమెకు ఏమి కష్టమో విచారింపుము.' అని యాజ్ఞాపించెను. అతఁడు సరియే యని కత్తి కట్టుకొని కరతలను జళిపించుచు బయలు వెడలెను. మేఘము మెఱపులతోడ రోదోరంధ్రము పూడునట్లుగా వర్షించుచున్నను అతఁడు వెడలుట గని, రాజు