Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాపము తీఱని కార్పటికుని కథ.

925

అధికృతుఁడు పలికెను. 'అహో! ఇప్పటికిని లక్ష్మి వానిని కటాక్షింపదాయెఁ గదా!' యని రాజు మనస్సులో చింతించి, మిగుల విషాదము నొంది, ఆఫలమును చేతఁగొని యాస్థానము చాలించి లేచెను. కార్పటికుఁడును ఆవస్త్రములలో నొకటి బజాఱులో అమ్మి అన్న పానములు తీర్చుకొని రెండవదానిని రెండు తుండెములుగా చింపి తాను ధరించెను.

మూఁడవనాఁడు రాజు నిండోలగంబున ఆ సూక్తినే మరల పాడించి కార్పటికునికి ఆమాతులుంగమునే ఇచ్చెను. అందఱును ఆశ్చర్యపడిరి. కార్పటికుఁడు వెలువడి ఆ బీజపూరమును రాజవిలాసినికి ఇచ్చెను. జంగమ యైన రాజసమ్మాన తరువల్లియుంబోలె ఆ విలాసిని యతనికి అగ్రఫలసూచక మయిన కుసుమముంబోలె సువర్ణము నొసంగెను. దాని నమ్మి కార్పటికుఁడు ఆదినము సుఖ ముండెను. ఆమె రాజదర్శనము చేసి ఆ ఫలమును నజరు పెట్టెను. నీకిది యెక్కడి దని రా జడుగఁగా కార్పటికునివలనిది యని యామె చెప్పెను. 'ఇప్పటికిని లక్ష్మి వానిని కటాక్షింపదాయెఁ గదా. ఈ పుణ్యహీనుఁడు నా కరుణ నిష్ఫలము గా దాని యెఱుంగఁడు. ఆహా! ఈ మహారత్నములు నాయొద్దకే మరల మరల వచ్చుచున్నవి!' అని తలపోసి యా ఫలమును పదిలపఱిచి ఆహ్నికకృత్యములకు రాజు లేచెను.

నాలవనాఁడు సభలో సామంత సచివాదు లెల్లరు నిండియుండ, ప్రభువు కార్పటికుని తన చెంతఁ గూర్చుండఁ బెట్టుకొని