924
కథాసరిత్సాగరము. లం. 9. త. 3
నని యతఁడు పలికెను. రాజు 'ఆహా! వీని పాపము ఇప్పటికిని క్షీణింపదాయెను గదా. అని విషాదపడి ఆశ్చర్యపడి యాఫలమును గైకొని సభ చాలించి తత్క్షణమే లేచి పోయి దినకృత్యములు జరిపెను. కార్పటికుఁడు ఆ శాటిని అమ్మి అన్న పానములు నెఱవేర్చుకొని మరల యథాప్రకారము సింహద్వారమున నుండెను.
మఱునాఁడు రాజు యథాప్రకారము ఆస్థానము నలంకరించెను. అందులకు పురజను లందఱును యథాప్రకారము వచ్చిరి. కార్పటికుఁడును వచ్చెను. వానిని రాజు చెంగటికిఁ బిలిచి కూర్చుండఁబెట్టి ఆసూక్తినే మరల పాడించి కరుణించి రత్నగర్భ మయిన యా మాతులుంగమునే మరల అతనికి ఇచ్చెను. 'ఆహా ! ప్రభువు వీనిపై రెండవపర్యాయము అనుగ్రహించినను వృథా అయినది ! ఏమి యిది !' అని సభాసదు లందఱును ఆశ్చర్యపడిరి. కార్పటికుఁడు ఫలమును గైకొని వ్యాకులుఁ డై రాజానుగ్రహమును సఫలముసుగాఁ దలంచి సభ వెడలి పోయెను. అంతలో దేశాధికృతుఁ డొకఁడు వచ్చి రాజదర్శనము చేయువాఁడై, శుభశకునము గోరుచుండి, యా ఫలమును గాంచి, రెండు వస్త్రములు వెల యిచ్చి దానిని గ్రహించి, ఓలగంబు సొచ్చి, రాజునకు ప్రణమిల్లి, ముందు ఆ మాతులుంగమును, పిమ్మట తాను తెచ్చిన నజరును అర్పించెను. ఈపండు నీ కెక్కడి దని రా జడుగఁగా కార్పటికునివలనిది యని