Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

916

కథాసరిత్సాగరము. లం. 9. త. 2

అనంగప్రభ సాగరవర్మయందు సముద్రమందు నదియుంబోలే అన్యగామిని గాక స్థిరముగా నెలకొని భవితవ్యతా ప్రభావముచే ధన్యమ్మన్య యై యుండెను. అతఁడును ఆమెవలన తనజన్మము సఫల మాయె నని యానందించెను. కొన్నాళ్లకు అనంగప్రభ గర్భిణి యై యథాకాలము కుమారునిఁ గనెను. వానికి తండ్రి సముద్రవర్ముఁ డని పేరు పెట్టి అతివిశేషముగా పుత్త్రోత్సవము చేసెను. క్రమముగా ఎదిగి గుణవంతుఁడై యువ యై బలపరాక్రమశాలి యైన యాకుమారునికి రాజు యౌవరాజ్య పట్టాభిషేకము చేసెను. పిమ్మట అతనికి సమరవర్మయను రాజుకొమారితను కమలవతి యనుదానిని తెచ్చి వివాహము చేసి, గుణాకృష్ణుఁ డై తన రాజ్యమునే యిచ్చివేసెను. పరాక్రమవంతుఁడు సముద్రదత్తుఁడు రాజ్యమును పొంది క్షత్త్రధర్మము నెఱింగి తండ్రికి ప్రణమిల్లి విన్నపించుకొనెను.- 'నాయనా, దిగ్విజయమునకుఁ బో'యెదను, నాకు సెల విమ్ము; జయశీలుఁడు గాక భూమికి పతి అగువాఁడు స్త్రీకి పతి యగు నపుంసకుఁడువోలె నిందనీయుఁడు. నిజబాహుబలముచే పరరాష్ట్రములను గెలిచి ఆర్జించిన లక్ష్మి రాజులకు ధర్మ్యము కీర్తికరియు. తమప్రజలనే పిల్లులువోలె భక్షించు లుబ్ధులకు రాజ్యము ఐశ్వర్యకరమా?' సాగరవర్మ యిట్లనియె. పుత్త్రా నీకు రాజ్యము క్రొత్త, ముందుగా దానిని దృఢముచేసి కొనుము. ప్రజలను ధర్మ్యముగా పరిపాలించువారికి