Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

908

కథాసరిత్సాగరము. లం. 9. త. 2

కూడ కామునిచే ఏ మే మో నర్తింపింపఁబడెను. ఒకనాఁడు ఏకాంతమందు నాట్యశాలయందు అనంగప్రభ తనంతట తానే వానిని రతార్థము పైకొనెను. రతాంతమందు ఆమె అత్యంత సానురాగ యై యతనితో నిట్లనియె. - నీవు లేక నేను నిమిషమయిన నిలువలేను. హరివరరాజు మనవృత్తము నెఱింగిన క్షమింపఁడు. కనుక రాజునకు తెలియని చోటికి ఎచటికైనను పోవుదము రా, నీకు రా జిచ్చినట్టిది హేమహయోష్ట్రాదికము విస్తారము కలదు, నాకును అమితము ఆ భరణజాత మున్నది, త్వరగా నిర్భయముగా పోవుదము.' ఈ మాటకు నాట్యాచార్యుఁడు అంగీకరించెను. అనంగప్రభ మగవేసము వేసికొని, తనకు మిగుల నంతరంగమిత్త్ర మైన యొక చేటిని తోడ్కొని, నాట్యాచార్యునియింటికిఁ బోయెను. వెంటనే నాట్యాచార్యుఁడు ధన మంతయు లొట్టిపిట్టలమీఁద ఎక్కించి బయలు వెడలెను. వానితో ఆమె గుఱ్ఱ మెక్కి పయనము చేసెను. మొదట వైద్యాధరలక్ష్మిని వదలి రాజశ్రీని ఆశ్రయించినది, ఇప్పుడు చారణలక్ష్మిని కోరినది! చీ! స్త్రీలమనస్సు ఎంత చపలము! వానితోఁగూడ దూరము పోయి అనంగప్రభ వియోగపురమను నగరము చేరి అచట వానితో సుఖ ముండెను. ఆమె లభించినందున ఆనటాగ్రణియు తనలబ్ధపరనామము సార్ధకముగా తలంచి సుఖ ముండెను.