Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంగప్రభ కథ.

899

కడమ మువ్వురు వీరులును వచ్చినదారినే పోయిరి. జీవదత్తుఁడు శ్రద్ధాళు వై వింధ్యవాసిని నుపాసించెను. ప్రసన్న యై దేవి స్వప్నములో వర మిచ్చెను. "పుత్త్రా, నీ తపస్సునకు సంతోషించితిని. లే లెమ్ము ; వినుము. -ప్రాలేయాచలమందు వీరపురం బని నగరము కలదు. అందు సమరుఁ డని విద్యాధరాధీశుఁడు ఉన్నాడు. అతనికి అనంగవతీ దేవియందు అనంగప్రభ యని కొమారిత కలిగినది. ఆమె రూపయౌవనగర్వముచే ఎవనిఁ గాని పతినిగా అంగీకరింప కుండఁగా, ఆ మొండితనమునకు కోపగించి తల్లితండ్రులు 'ఓసీ, మనుష్యస్త్రీ వగుము. అటులయినను భర్తృసుఖము నెఱుంగక కన్యవ యై పదియాఱు వత్సరము లుండి ఆ దేహమును వదలి ఇటకు వత్తువు. అంతట నీకు మర్త్యుఁడు విరూపుఁడు ఖడ్గసిద్ధుఁడు పతి యగును. అతఁడు మునికన్యను కామించిన దోషమున శాపము నొంది మమష్యుఁడైనవాఁడు. నీకు ఇచ్చ లేకపోయినను వాఁడు బలాత్కారమున నిన్ను మర్త్యలోకమునకుఁ గొనిపోవును. నిన్ను మఱియొకఁడు కొనిపోవుటచే వానికి నీతో వియోగము కలుగును. పూర్వ జన్మమందు వాఁడు ఎనమండుగురను పరభార్యలను హరించినాఁడు సుమా. అందువలన ఎనిమిదిజన్మముల ననుభవింపఁ దగిన దుఃఖమును వాఁడు ఒకజన్మములోనే అనుభవించును. నీవును విద్యలు పోయి మానుషి వై యొక్కజన్మ మందే ఎనిమిది జన్మములదివోలె గొప్ప దైన దుఃఖమును అనుభవించెదవు.