అనంగరతి కథ.
897
ఆ వీరులు మూఁడునెలలు ఆ నగరమందే కనుపెట్టుకొని యుండిరి. పిమ్మట రాజు వారలను గణకుని అనంగరతిని పిలిపించి, ఆకస్మికముగా అప్పుడు మునుపటికన్న అధిక సుందరి యయిన యాయనంగరతిని చూచి సంతోషించెను. గణకుఁడు ఆమెకు కాల మాసన్న మాయె నని తలంచెను. రాజు 'ఆ మూఁడు మాసములు గడచినవి గదా, ఇప్పుడు ఏమి చేయఁ దగునో చెప్పుము.' అని అడుగునంతలో ముఖమునకు పైఁట చెఱంగు ముసుఁ గిడి ఆమె మానుష దేహమును వదలెను. ఏమి యిట్లున్నదని రాజు స్వయముగా ముసుఁగు తీసి మోము చూడఁగా మృత యై యుండెను. కనుఁదేంట్లు సోలి మోముఁదమ్మి కళ దప్పి మంజుల హంసనాద మేది మంచుదెబ్బ పడిన పద్మినియుం బోలె నుండెను. ఆ శోకావేగము పిడుగుఁ దెబ్బయుంబోలే నవియింప ఆ భూభృత్తు స్వపక్షచ్ఛేద మూర్ఛితుఁ డై నిశ్చేష్టుఁ డై నేల వ్రాలెను. రాజ్ఞి పద్మరతియు సొమ్మసిల్లి తొడవు లనెడు పువులు రాల ఏనుఁగు త్రెంపిన పూలగుత్తియుంబోలె నేలఁ గూలెను. పరిజనులు ఎలుం గెత్తి రోదనములు సేయఁగా, ఆ వీరులు దుఃఖాక్రాంతు లై యుండఁగా, రాజు తెలివి వచ్చి జీవదత్తుని పిలిచి 'ఇప్పుడు ఇతరులకు శక్తిలేదు. నీ సమయ మిది. మృతి నొందిన స్త్రీని బ్రదికించెద నని ప్రతిజ్ఞ చేసితివి గదా. నీవిద్య నిజమేని నా కొమారితను బ్రదికింపుము, విప్రునికి నీకే దానిని ఇచ్చెదను.'