Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

896

కథాసరిత్సాగరము. లం. 9. త. 2

రా జనియె - 'పంచపట్టిక భాషాజ్ఞులు అనవర్ణులేని, జీవదత్తుడు విప్రుఁ డైనను రూపహీనుఁడును వికర్ముఁడు నేనియు, క్షత్రియుఁ డయిన ఖడ్గధరునియందు దోషము ఏ మున్నది? అతఁడు బల విక్రమశాలి, సుప్రమాణుఁడు, సురూపుఁడు, అట్టి మదపుటేనుఁగును కొట్టినాఁడు, సింహములను నేలఁ బెట్టి రాచినాఁడు దరిద్రుఁడు సేవకుఁడు నని దోషము చెప్పుదువేని, నేను అతనిని ఇతరులకు దొరనుగా సేవ్యునిఁగా నిమిషములో చేసెదను. పుత్త్రీ, నీకు ఇష్టమేని వానిని వరింపుము.' అనంగవతి యిట్లనియె: 'అట్లయిన ఆవీరుల నందఱను ఇట రావించి గణకుని అడుగుము అతఁ డేమి చెప్పునో చూతము.' రాజు వారిని పిలిపించి వారియెదుట స్వయముగా గణకుని 'వీరిలో అనంగరతికి ఎవరితో పొంతనములు కుదురునో చెప్పుము.' అని యడిగెను. గణకుఁడు వారి నక్షత్రము లడగి తెలిసికొని, చాలసేపు గణించి, రాజుతో 'దేవా, కోపము గాదేని మనవి చేసెదను. వీరిలో ఒకనితో నయినను అమ్మాయికి పొంతనములు కుదురలేదు. ఈమెకు వివాహయోగము లేదు. ఈమె శాపమువలన జనించినది, విద్యాధరి. ఆశాపము ఇఁకను మూఁడునెలలకు నివర్తించును. కనుక వీరు ఇచటనే మూఁడునెలలు కను పెట్టుకొని యుందురుగాక. ఈమె యప్పటికి స్వలోకమునకు పోదేని అటుపయిని వివాహము కావచ్చును.' మౌహూర్తికుఁ డిట్లు పలుకఁగా అందఱును నమ్మిరి.