అనంగరతి కథ.
895
మూఁడవ దెబ్బకు దాని రెండుపాదములను ఖండించెను అంతట ఏనుఁగు చావు ఘీంకారము చేసి నేలఁగూలి ప్రాణము విడిచెను, ఆపరాక్రమమును చూచి జను లందఱు ఆశ్చర్యపడిరి. మహావరాహరాజు కూడ దానిని విని ఆశ్చర్యపడెను.
మఱునాఁడు రాజు ఏనుఁగు నెక్కి ఈఖడ్గధరాదివీరులను నలువురను తోడ్కొని వేఁటకుఁ బోయెను. అచట ఱేఁడును సైనికులును వ్యాఘ్రమృగ వరా హాది జంతువులను చక్కాడు చుండఁగా, ఏనుఁగుల ఘీంకారములను విని కోపమున సింహములు గుహలు వెలువడి వారిమీఁదికి వచ్చినవి. అట్లు పైఁబడుచున్న యొకసింహమును ఖడ్గధరుఁడు ఒక కత్తి దెబ్బతో రెండు తుండెములు చేసెను. మఱియొక సింహమును ఎడమచేత కాలు పట్టుకొని గిఱగిఱఁ ద్రిప్పి నేలఁ గొట్టి కాలధర్మము నొందించెను. భాషాజ్ఞ జీవదత్త పంచపట్టికులు ఒక్కొకఁడు ఒక్కొక సింహమును అట్లే తెగటార్చిరి. ఇట్లు ఱేని కన్నుల యెదుటనే ఆ వీరులు పాదచారులై అవలీలగా ఆ సింహవ్యాఘ్రాదుల నన్నిటిని రూపు మాపిరి రాజు ఆశ్చర్యపడి సంతోషించి వేఁట సాలించి నగరమునకు వచ్చెను. ఆ వీరులును దౌవారికుని గృహమునకుఁ బోయిరి.
రాజు అంతఃపురమునకుఁ బోయి, బడలి యుండియు తత్క్షణమే కొమారితను రప్పించి, వేఁటలో తాను జూచిన యా వీరుల పరాక్రమములను వివరించెను. ఆమెయు ఆశ్చర్యపడెను.