894
కథాసరిత్సాగరము. లం. 9. త. 2
కెట్లు నన్ను అర్పించుకొందును ? మూఁడవవాఁడు గుణవంతుఁడు, నాకు సవర్ణుఁడు అయినను సేవాజీవి, దరిద్రుఁడు, ప్రాణ మమ్ముకొనువాఁడు రాజుకొమారిత నై వానియిల్లాల నె ట్లగుదును? నాలుగవవాఁడు జీవదత్తుఁడు బ్రాహ్మణుఁడు, అతఁడును నాకు ఇష్టుఁడు గాఁడు; విరూపుఁడు కర్మహీనుఁడు పతితుఁడు; వానిని నీవు దండించుట యుక్తము. వానికి నన్ను ఎట్లు ఇత్తువు? నాయనా, నీవు రాజవు వర్ణాశ్రమధర్మరక్షకుఁడవు గదా. ఖడ్గశూరుఁ డైన రాజుకంటె ధర్మశూరుఁడు శ్రేష్ఠుఁడు, వేలకొలఁది ఖడ్గశూరులకు ధర్మశూరుఁడు పతి యగును.' ఇట్లు పలికిన తనయను అంతఃపురమునకు పంపి రాజు స్నానాది కృత్యములకై లేచెను.
మఱునాఁడు ఆవీరులు దౌవారికుని యింటినుండి వెడలి కౌతూహలముచేత నగర మెల్లఁ ద్రిమ్మరు చుండిరి. అంతలో పద్మకబళ మనుమదపుటేనుఁగు కట్టుఁగంబము విఱిచి, తబేలా నుండి వెలువడి, జనులను త్రొక్కుకొని వచ్చుచు ఆ వీరులను కని చంపుటకు తఱుమసాగెను. వారును దానిమీఁదికి ఆయుధపాణు లై పరు వెత్తిరి, వారిలో క్షత్త్రియుఁ డయిన ఖడ్గధరుఁడు కడమ మువ్వురను నివారించి తాను ఒకఁడే గర్జించుచుచున్న యాయేనుఁగుమీఁదికిపోయి దాని తుండమును ఒక్క వ్రేటుతో తామరతూఁటింబోలె ఖండించి, దాని కాళ్ల నడుమనుండి వెలువడి, లాఘవము చూపి వెనుకవైపున రెండవదెబ్బ కొట్టెను.