Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

726

కథాసరిత్సాగరము. లం. 8. త. 1

సర్వదమనుఁడు, వీతభీతి, శుభంకరుఁడు ననుమంత్రులు ప్రభువుతో ఆకాశమున కెగసిరి. వారితో విద్యాధరులకు గొప్ప యుధ్ధము జరిగెను. సూర్యప్రభుఁడు దామోదరునిమీఁదికీ పోయి ఎదిరినవారిని కత్తితో నఱుకుచు వారియాయుధముల దెబ్బలకు డాలుతో తన్ను కాచుకొనుచు నుండెను. ఆయుద్ధములో మనుష్యులు కొంచెముమంది, విద్యాధరులు లక్షమంది; అయినను, ఇరువాగును పరస్పరము సమానముగానే పోరెను. రుధిరారుణములును ఆకులములు నై ఖడ్గలతలు యమధర్మరాజదృష్టులుం బోలె శూరకాయములందు పడుచుండినవి. భయపడి శరణుఁ జొచ్చినవియుంబోలే విద్యాధరులశిరములును శరీరములును భూమిమీఁద చంద్రప్రభునియెదుట పడినవి. సూర్యప్రభుఁడు లోకులకుఁ బ్రత్యక్ష మైన ఖేచరశ్రీతో నొప్పుచుండెను. ఆకాశము సిందూరపూర్ణముంబోలె రక్తముచేత కెంపెక్కెను సూర్యప్రభుఁడు కత్తియు డాలును చేతఁ బూని దామోదరునితో పోరెను. పోరుచు కరణప్రయోగముచేత అతనియందు ప్రవేశించి కత్తితో డాలు తెగ నఱికి అతనిని నేలఁ గూల్చెను. సూర్యప్రభుఁడు త్రుళ్లిపడుచున్న యరియొక్క శిరమును తెగ నఱుక నుండఁగా ఆకాశమునుండి విష్ణువు హుంకరించెను. దానిని విని హరిని చూచి నమ్రుఁ డై సూర్యప్రభుఁడు హరిగౌరవముచేత దామోదరుని వదలెను. చావు తప్పిన నిజభక్తుని దామోదరుని తోడ్కొని హరి ఎచటికో