886
కథాసరిత్సాగరము. లం. 9. త. 2
కారములతో సత్కృతుఁ డై ఆ విమానమునే వధూ మంత్రి వయస్య సమేతముగా ఎక్కి కౌశాంబికి వచ్చి, తల్లిదండ్రులకు నేత్రోత్సవము చేసెను. అచట కాంచనప్రభ వాసవదత్తకును వత్సరాజునకును ఎదుట కొమారిత యలంకారవతితో నిట్లనియె. - 'నీవు ఎప్పుడును భర్తను ఈర్ష్యా కోపముచేత దుఃఖపెట్టకుము. ఆపాపమువలన విరహము కలిగి గొప్ప యనుతాపము పుట్టించును ఈర్ష్యచే నేను పూర్వము నాపతిని దుఃఖపెట్టితిని, అందుచే ఇప్పుడు ఆయన వనమునకు పోఁగా, నేను పశ్చాత్తాపముచే కాలుచున్నాను.' ఇట్లు పలికి, కన్నీళ్లు విడుచుచు ఆమెను కౌఁగిలించుకొని ఆకసమున కెగసి తన నగరమునకు పోయెను.
హఠశర్మ కథ.
మఱునాఁడు నరవాహనదత్తుఁడు ప్రాతఃకృత్యములు సలిపి మంత్రులగోష్ఠిలో నుండఁగా, అలంకారవతియొద్దకు ఒక విలాసిని వచ్చి భయకంపములతో 'దేవీ, అబలను నన్ను కావుము కావుము. వీఁడు గో బ్రాహ్మణుఁ డొకఁడు నన్ను చంపఁ దఱుముకొని వచ్చి బయట నున్నాఁడు, అతనిభయముచే నేను శరణార్థిని నై ఇచటికి వచ్చితిని.' అని మొఱపెట్టెను. 'భయపడకు, వృత్తాంతము చెప్పుము. ఎవఁడు అతఁడు? ని న్నెందులకు చంపఁ దఱుముచున్నాఁడు ?' అని యలంకారవతి యడుగఁగా, ఆమె మరల చెప్ప సాగెను.-