Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

880

కథాసరిత్సాగరము. లం. 9. త. 1

రాత్రి ఉత్సుకుఁ డై రూపలతతో వాసభవనము ప్రవేశించి, రతనాలపట్టెమంచము, రతనాలరాకట్టు, మణికంబంబులు, మణిదివ్వెలుం గలిగి కనులపండు వైన యచ్చోట, ఆమెతో చిరసంకల్పగుణిత మైన భోగకేళిం దేలి నిద్రించెను. వేకువను వందిమాగధ గీత బోధితుఁ డై స్వర్గమున నింద్రుండు వోలె అట నుండెను.

ఇట్లు అచట అత్తమామ లలవరించిన దివ్యభోగముల ననుభవించుచు పదిదినము లుండి పదునొకండవనాఁడు గణక నిశ్చిత శుభలగ్నంబున శ్వశ్రూ రచిత మంగళుం డై రూపలతం దోడ్కొని వెడలెను. కడలివఱకు మామగారు సాగ నంపఁగా పృథ్వీధరుఁడు రూపలతతోను అనుచరులతోను ఓడ ఎక్కెను. ఎనిమిది దినములలో సాగరమును దాఁటి ఒడ్డున నున్న తన దండును కలిసికొనెను. ఉదారచరితుఁడు ఎదురు వచ్చి ఇతనిని పత్త్రపురమునకు తోడ్కొని పోయెను. ఇతఁడు అతనివలన నుపచారము లొందుచు కొలఁది దినములు విశ్రమించి, మరల పయన మాయెను. ప్రియతమను జయమంగళ మను నాగేంద్రముపై నెక్కించి, తాను కల్యాణగిరి యను కరీంద్రము నెక్కి సంతత ప్రయాణములచే తనరాకకై జెండా లెత్తి యున్న నిజనగరము ప్రతిష్ఠానము ప్రవేశించెను. అందు పురాంగనలు రూపలతను అచ్చెరువడి ఱెప్ప వాల్పక చూచి రూపగర్వమును వదలుకొనిరి. రాజధాని ప్రవేశించి పృథ్వీరూపుఁడు ఉత్సవము