866
కథాసరిత్సాగరము. లం. 9. త. 1
పురుషుని అడు గయినను పాయదు. కాఁబట్టి నేను అడవికిఁబోయి ఉత్తమ మయిన తపస్సు చేసి శాశ్వత మయిన పరమపదమును పొందెదను.” ఇట్లు కుమారుఁడు ధర్మశీలుఁడు పలుకఁగా తండ్రి యలంకారశీలుఁడు బాష్పాకులలోచనుఁడై యిట్లు పలుకుచున్నాఁడు: - 'పుత్త్రా, బాలునికి నీకు అకాలములో ఏమి యీచిత్తభ్రమ ! యౌవన మనుభవించిన పిమ్మటఁ గదా పెద్దలు శాంతిని విధించియున్నారు. వివాహమై ధర్మ్యముగా రాజ్యపరిపాలనము చేయుచు భోగము లనుభవించుట కిది కాలము గాని వైరాగ్యమునకుఁ గాదు.' ధర్మశీలుఁ డనియె : - 'శమమునకు అశమమునకు వయోనియమము లేదు. ఈశ్వరానుగ్రహ పాత్ర మై బాలుఁడు గూడ శాంతిని భజించును. కాపురుషుఁడు వృద్ధుఁ డయ్యును శాంతిని సేవింపఁడు. నాకు రాజ్యమందును వివాహమందును ప్రీతి లేదు. నాకు తపస్సుచే శివుని ఆరాధించుటయే జన్మఫలము.' కుమారుఁడు ఇట్లు పలుకఁగా తండ్రి అలంకారశీలుఁడు వానిపట్టుదలను నివారింప శక్యము గా దని యెఱింగి కన్నీళ్లు విడుచుచు 'పుత్త్రా, బాలునికి నీకే ఇట్టి వైరాగ్యమేని, వృద్ధునికి నాకు లేదా? కనుక నేనును తపముకై అడవికి వచ్చెదను.' అని పలికి, మనుష్యలోకమునకు పోయి, పేదబ్రాహ్మణులకు రత్నములును బంగారమును పదివేల బారువులు ఇచ్చి వచ్చి, భార్యతో 'నీవు నాయాజ్ఞచే ఇచటనే నగరమందు అలంకారవతిని