Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామచూడామణీ వివాహము.

855

వివాహము ముగియఁగా సుమేరువు అచ్చటఁ జేరిన సురాసుర విద్యాధర దేవ మాతృ ప్రభృతులను అందఱను 'మీ రందఱు ఈదినము మాయింట దయచేసి భోజనము చేయవలయును; ఇదిగో శిరమున అంజలి చేర్చితిని. ' అని వేఁడుకొనెను. సుమేరుని యీ ప్రార్థనను విని అందఱు అంగీకరింపక ఉండఁగా, నందీశ్వరుఁడు వచ్చెను. అందఱును అతనికి ప్రణతులయిరి. అంతట నంది "సుమేరువునింట మీరందఱు భుజింప వలసినది. ఇతఁడు మాపరిగ్రహము గదా. ఇతని యన్నము తిన్న మీకు శాశ్వత మైన తృప్తి గలుగును.' అని మీకు త్రిశూలపాణి ఆజ్ఞాపించుచున్నాఁడు.” అనెను. నందివచనము విని అందఱు అంగీకరించిరి. అంతట అచటికి లెక్కలేని సంఖ్యలుగా ప్రమథులు వినాయక మహాకాల వీరభ ద్రా ద్యధిష్ఠితు లై వచ్చి ఆ వేదిని భోజన సన్నద్ధనుగాఁ జేసి, ఆ దేవాసుర విద్యాధర మానుషులను కూర్చుండఁబెట్టి వారికి అందఱకు సుమేరు విద్యాకల్పితములును శంకరాజ్ఞచే కామధేనువు పిదికినవియు నైన యాహారములను వడ్డించిరి. ప్రతివానియొద్దకును యథార్థముగా కావలసినదానిని విచారించుచు వీరభద్ర మహాకాల భృంగి ప్రభృతులు తిరుగుచుండిరి. ఎల్లయెడలను సంతసముచే ఖేచరులు కూడు చుండ, దివ్యాంగనానృత్యసుందరముగా సంగీతకము ఘూర్ణిల్లుచుండెను. ఆహారాంతమందు వారి కందఱకు నందీశ్వరాదులు దివ్య మాల్య వస్త్రాభరణముల నొసంగిరి.