Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

854

కథాసరిత్సాగరము. లం. 8. త. 7

నిశ్చయించి, కంబములును నెలకట్టును మణిమయముగా పెండ్లి యరఁగు చేయించి, ఆమణులకాంతిచే అగ్ని పొసుఁగువడిన ట్లొప్పుచుండఁగా, కామచూడామణిని రావించెను. ఆమెలావణ్యమును లోలుపములైన దేవాసురేక్షణములు త్రాగునవియుం బోలె నుండెను. ఉమ హిమవంతునివలనఁ బుట్టినది, ఈమె సుమేరువులనఁ బుట్టినది, అనియుంబోలె ఉమతో సమాన మైన సౌందర్యము గల దై కామచూడామణి వెలుంగు చుండెను. ఆమెను పెండ్లికూఁతుఁగావించి వేదియెక్కించి సాలంకారనుగా సుమేరువు సూర్యప్రభునికి దానముచేసెను. సూర్యప్రభుఁడును దనుప్రభృతులచే బద్ధకంకణ మైన కామచూడామణీ పాణిపం కే రుహమును చేపట్టెను. తొలిలాజహోమమున జయ వచ్చి సూర్యప్రభునికి భవాని పంపిన యనశ్వర దివ్యమాల నిచ్చెను. సుమేరువు వెలలేని రత్నములను ఐరావణముకొడు కయిన యొక వారణేంద్రమును ఇచ్చెను. రెండవ లాజహోమమందు జయరత్నావళి నిచ్చెను; దానిని కంఠమందుఁ దాల్చిన క్షుత్తృష్ణా మృత్యువులు బాధింపవు. సుమేరువు రెండింతల రత్న రాశిని ఉచ్చైఃశ్రవముకొడు కయిన హయవతంసమును ఇచ్చెను. జయ మూఁడవ లాజమోక్షమున కంఠమున ధరించిన యౌవనమును నిలుపునదైన యేకావళి నిచ్చెను. సుమేరువు మూఁడింతల రత్నరాశిని, సర్వసిద్ధ్యుపయోగి యగు గుళికను, ఇచ్చెను.