Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యుద్ధాంతము.

847

లంబించి యున్నాఁడు. కనుక మీకు ఇప్పుడు జయకాలము గాదు. పట్టు మానుఁడు, సంధి చేసికొనుఁడు.'

బ్రహ్మ యిట్లు పలికినంతలో ప్రభాసుఁడు పాశుపతాస్త్రమును ప్రయోగించెను. సర్వసంహారి యగు నా రౌద్రాస్త్ర విజృంభణమును చూచి హరి సుతస్నేహముచే సుదర్శన చక్రమును ప్రయోగించెను. అంత నాదివ్యాస్త్రములు రూపములు దాల్చి ఒండొరువులతో పోరఁ దొడంగినవి. ఆకాలమందు సర్వసంహార మగు నని మూడులోకములును వణఁకుచుండెను. 'నీయస్త్రమును ఉపసంహరింపుము, నాయస్త్రమును నేను ఉపసంహరించెదను.' అని హరి ప్రభాసుని అడిగెను. 'ప్రయుక్తమైన నాయస్త్రము వృథా పోదు, కనుక దామోదరుఁడు పోరు మాని పాఱిపోవుత, అస్త్రమును ఉపసంహరించెదను.' అని ప్రభాసుఁడు పలికెను. 'అ టయిన నాయస్త్రమును నీవును సమ్మానింపుము. రెండును విఫలములు కావు గాక.' అని హరి కోరెను. ప్రభాసుఁడు కాలమెఱిఁగి 'అట్లే కానిమ్ము, నీచక్రము నారథమును కొట్టును గాక.' అని యొడంబడెను. అంత హరి దామోదరుని రణము నుండి తొలంగించెను. ప్రభాసుఁడు అస్త్రమును వెనుదివిచెను. చక్రాయుధము రథముపైఁబడెను. ప్రభాసుఁడు మఱియొక తే రెక్కి సూర్యప్రభుని యొద్దకు పోయెను. దామోదరుఁడు శ్రుతశర్మ యొద్దకు పోయెను.