720
కథాసరిత్సాగరము. లం. 8. త. 1
.
వోలె నొప్పుచుండెను. వీరభటుఁడు సంబంధిని అల్లుని చక్కఁగా పూజించి యథావిధిగా తనయలను దానము చేసి వివాహమహోత్సవము నడపించెను. వేయిబారువుల బంగారమును, రత్నాభరణములభారములతోడి నూఱు లొట్టియలను, నానావస్త్రభారములతోడి యేనూఱు లొట్టిపిట్టలను, ఏఁడువేలగుఱ్ఱములను, అయిదువేల యేనుఁగులను, రూపాభరణవతు లయిన వారస్త్రీలను వేగురను, వీరభటమహారాజు వేదియందు రొమారిత లిరువురకు ఇచ్చెను. అల్లునికిని సంబంధికిని సద్రత్నములతోను దేశములతోను ఉపచారములు చేసి వారి మంత్రులను ప్రహస్తాదులను కూడ యథార్హముగా సమ్మానించెను. పురజనులెల్ల, హర్షించు నట్లుగా మహోత్సవము చేసెను. సూర్యప్రభుఁడు తండ్రియుం దానును ప్రియాన్వితుఁ డై ఆసమయమందు నానాహారపానగేయాదిభోగము లనుభవించుచుండెను.
ఇంతలో రంభునియొద్దనుండి వజ్రసారనగరమునుండి దూత వచ్చి ఆస్థానములో తమదొరమాటగా ఇట్లు విన్నపించెను. 'విద్యాబలగర్వితుం డైన యువరాజు మాకొమారితను హరించి మమ్ము అవమానపఱిచినాఁడు. ఇప్పుడు మాకు తెలిసినది. వీరభటమహారాజుతో ఎట్టి సంబంధము చేసితిరో తత్సమానవ్యసనుఁడ నయిన నాతోను అట్లే చేయవలయు నని కోరుచున్నాను. మాసంధిని అంగీకరించి మీరు ఇచటికి వత్తురేని సరియే, రానియెడల మృత్యువువలన మాకష్టము తీఱును.'