Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

826

కథాసరిత్సాగరము. లం. 8. త. 6

వేని నీకు సైన్యములతోఁగూడ నిశ్చయముగా నాశము కలుగును. నీవు సంధికై అతనికడకు దూతను పంపిన అతఁడు అంగీకరించును.' అని నీకు తెలుపు మని నన్ను విష్ణుదేవుఁడు పంపినాఁడు. నీవును భక్తుఁడవు, ఆయన భక్తుల యోగ క్షేమమును చూచుకొనువాడు గదా.' అని చెప్పెను. దానిని విని విక్రమశక్తి 'నిశ్చయముగా ఇది సత్యమే. కాదేని ఇచటికి ఎవఁడు రాఁగలఁడు. ఇది మనుష్యోచిత మయిన యాకృతి గాదు.' అని యాలోచించుకొని, గుణశర్మతో 'నేను ధన్యుఁడనయితిని. దేవుఁడు నాకు సందేశము పంపునంతపుణ్యము నాకుఁ గలిగినది. దేవునియాజ్ఞ ప్రకారము చేసేదను.' అనెను. అంతట గుణశర్మ రాజునకు నమ్మకము గలిగించువాఁ డై అంతర్థానాంజన ప్రభావముచేత అంతర్హితు డై వెడలి పోయి, తాను చేసినది మహాసేనునికి తెలియఁ బఱిచెను. ప్రాణరాజ్యప్రదుఁ డయిన యాగుణశర్మను కంఠాలింగనము చేసికొని మహాసేనుఁడు సంతోషించెను. అట్లే విక్రమశక్తి మఱునాఁడు దూతముఖముగా మహాసేనునితో సంధిచేసికొని తరలిపోయెను. ఇట్లు మహాసేనుఁడు గుణశర్మప్రభావముచే సోమకుని గెలిచి ఏనుఁగులను గుఱ్ఱములను కైకొని ఉజ్జయినికి పోయెను. అచట రాజును నదీస్నానమునందు మొసలినుండియు, ఉపవన విహారమునందు పాముకాటువిషమునుండియు గుణశర్మ రక్షించెను.