Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

824

కథాసరిత్సాగరము. లం. 8. త. 6

మానుము.' అని గుణశర్మ పలికెను. 'ఓరి నీరసుఁడా, ఈ నీ రూపము కలావైదగ్ధ్యము నిష్ఫలములే గదా. అనురక్త నయిన యిట్టి నన్ను ఉపేక్షించుచున్నావు.' అని రాణి పలికెను. గుణశర్మ 'చక్కఁగా చెప్పితివి ఏవి పరదారాపహరణము చే అకీర్తిమలీమనములై ఇహపరముల నరకపాతము కలిగించునో ఆరూపవైదగ్ధ్యములకు ఏమి ఫలము?' అని యపహసించెను. అంతట రాణి అతనిపై అలిగినదియుంబోలె, 'నామాట చేయవేని నాకు చావు నిక్కము. కనుక అవమానిత నైన నేను ముందు నిన్ను చంపించి పిమ్మట నేనే చచ్చెదను. ' అనెను. 'బళి! అట్లే అగును గాక!' ధర్మబద్ధ మయిన జీవితము క్షణకాల మయినను మేలు, అధర్మముతోడి కల్పకోటిశతము లయినను మేలు కావు. పాపము చేసి రాజదండన నొందుటకన్న పాపము చేయక శ్లాఘ్యుఁడ నగు నామకరణము మేలు.' అని గుణశర్మ వాక్రుచ్చెను. దానిని వినియు రాణి మరల 'చెలువుఁడా, నీకును నాకును ద్రోహము చేయకు. చెప్పెద వినుము. రాజు నామాటను అశక్య మయినను దాఁటనేరఁడు. అతనితో చెప్పి నీకు దేశము లిప్పించెదను, సామంతుల సందఱను నీయనుచరులనుగా చేయించెదను. అట్లు గుణోజ్జ్వలుఁడ వైననీవే రాజ వగుదువు; అంతట నీ కేమి భయము ? ఎవఁడు నిన్ను ఎట్లు అవమానింపఁగలఁడు? కనుక నన్నుఁ గూడుము, కూడవేని ఇఁక నుండవు' అని హెచ్చరించెను. ఆ రాజాంగన వదలక