Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

808

కథాసరిత్సాగరము. లం. 8. త. 5

దేవాసుర యుద్ధముగా నున్నది. అందులో సర్వదా శ్రీహరి దేవతలకు సహాయుఁడు గదా. దామోదరుఁడు విష్ణ్వంశమువాఁడు ఇచట పోరుచున్నాఁడు.' ఇట్లు ఇంద్రుఁడు పలుకుచుండఁగా. సేనాపతికి దామోదరునికి సాహాయ్యార్ధము పదు నలువురు మహారథులు - బ్రహ్మగుప్తుఁడు, వాయుబలుఁడు, యమ దంష్ట్రుఁడు, సురోషణుఁడు, రోషావరోహుఁడు, అతిబలుఁడు, తేజఃప్రభధురంధరులు, కుబేరదత్తుఁడు, వరుణశర్మ, కంబళికుఁడు, దుష్టదమనుఁడు, దోహనుఁడు, ఆరోహణుఁడు - అనువారు వచ్చిరి. వీరు దామోదరునిఁ గూడి వ్యూహాగ్రమునఁ బోరుచున్న సూర్యప్రభుని యోధులను అడ్డగించిరి. వారిలోపల పరస్పరముగా ద్వంద్వయుద్ధములు కలిగినవి. దామోదరునితో ప్రకంపనుఁడు అస్త్రయుద్ధము చేసెను. బ్రహ్మదత్తునితో ధూమకేతువు, అతిబలునితో మహామాయుఁడు, తేజఃప్రభునితో కాలకంపనుఁడు, వాయుబలునితో మరుద్వేగుఁడు, యమదంష్ట్రునితో వజ్రపంజరుఁడు, సురోషణునితో కాలచక్రుఁడు, కుబేర దత్తునితో ప్రమథనుఁడు, వరుణశర్మతో సింహనాదుఁడు, దుష్టదమనునితో ప్రవహణుఁడు, రోషావరోహునితో ప్రహృష్టరోముఁడు, ధురంధరునితో వికటాక్షుఁడు, కంబళికునితో కంబళికుఁడు, ఆరోహణునితో కుంజరకుమారుఁడును, మహోత్పాతుఁడను మాఱుపేరుగల దోహనునితో ప్రహస్తుఁడును, ద్వంద్వ యుద్ధము చేసిరి. దానిం జూచి సునీథుఁడు మయునితో ననియె: