రాజశేఖర చరిత్రము
బెట్టి రాజశేఖరుడుగారు సొమ్ము తెచ్చుచుండిరి. అందుకే నానాటికి గృహమున గలసొత్తు తక్కువయి కాపాడవలసిన భారము తగ్గు చుండెను . ఇట్లు కొంతకాలము జరగగా నించుమింగా నింటగల జంగమ రూపమయిన సొత్తంతయు బుట్టలును తట్టలును కొయ్యలునుగా మాఱజొచ్చెను. అప్పుడు సహిత మాతడు యాచించినప్పుడు లేదని యెవ్వరిమనస్సులకును నొప్పి కలుగజేయ నిష్టములేనివాడయి, మున్నెప్పుడు ననత్య మన్నమాట నెఱుగనివాడయినను దరిద్రదేవతయొక్క యువదేశముచేత ధనదానములకు బదులుగా వాగ్దానముల మాత్రమే చేయ నారంభించెను . ఆహా ! మనుష్యుల చేత దుష్కార్యములను జేయించుటలో దారిద్ర్యమును మించినది మఱియొకటి లేదుగదా ? అతడీప్రకారముగా సర్వవిధములచేతను బాధపడుచున్నను, ఆసంగతి నొరు లెఱుగకుండుట కయి భోజన పదార్ధములలో దక్కువచేసియైన మంచిబట్టలను గట్టుకొనుచు అప్పుచేసియైన బీదసాదల కిచ్చుచు బయి కొకరీతి వేషముతో బ్రవర్తించుచుండెను. అది యేముమాయయో కాని లోకములో నెల్లవారును తాము సుఖపడుట కయి వహించుదానికంటె దాము సుఖము ననుభవించుచున్న ట్లితరులకు దోచుచున్నట్లు చేయుటకయియే విశేషశ్రద్ధను సహితము బిదతనమువలన గలుగు సౌఖ్యములను లాభములను వేదాంతగ్రంధములు వర్ణించిచెప్పుడు ధనము పాపమునకు గుదురని దూషింపుచున్నను , రాజశేఖరుడుగారు మాత్రము మనల నీ దారిద్ర్యదేవత యెప్పుడువదలునా యని నిమిష మొక యుగముగా గడుపుచుండిరి ; కాబట్టి యాత డింతవఱకును లక్ష్యముతో జూడని యదృష్ట దేవత నిప్పుడు మఱి మఱి ప్రార్ధింప సాగెను. దాని నాతదెంతయాసపడి వేడుచు వచ్చెనో యాయదృష్టదేవతయు నంతదూరముగా దొలగ నారంభించెను .