పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును చల్లి రుక్మిణి నావలకు దీసికొనిపోవచ్చు నని చెప్పి, ఆమెను లోపలికిగొనిపోయిన తరువాత గదితలుపు లోపలిగడియవేసికొని గడియసేపుండి వెలుపలికివచ్చి పయిని తాళమువేసి, ఆగ్రహమునకు బ్రతికియున్నకాలములో నృసింహమంత్రము వచ్చియున్నది, కాబట్టి యది యేదేవతకును లోబడినది కాదనియు, తనయావచ్ఛక్తి వినియోగించి గదిని విడిచి రాకుండునట్లు బంధించిమాత్రము వచ్చితిననియు, తా నీవలనుండి శరభసాళ్వమును బ్రయోగించినచో ఘోర యుద్ధముచేసి లోబడునుగాని మఱియొక విధముగా లోబడదనియు చెప్పి - "ఓం-ఖేం-ఖం-ఘ్రసి-హుం-ఫట్-సర్వశత్రు సంహారిణే-శరభ సాళ్వాయ-పక్షిరాజాయ-హుం-ఫట్-స్వాహా" - అని శరభసాళ్వమును పునశ్చరణ చేయనారంభించెను. రెండుమాఱులు మంత్రము నుచ్చరించునప్పటికి గదిలోనుండి యొకమనుష్యుని మఱియెవ్వరో కొట్టుచున్నట్టు చిన్నచిన్న దెబ్బలు వినబడినవి; ఆపిమ్మట నొకపెద్ద దెబ్బ వినబడెను. ఈప్రకారముగా నరగడియసేపు దెబ్బలు వినబడుచువచ్చి సద్దడగినతరువాత గ్రహము సులభముగానె దొరికెననియు దానినిప్పుడే తీసికొనిపోయి గోదావరిలో గలిపెదననియు జెప్పి తానొక్కడును, గదిలోనికిబోయి యందలి సమస్తవస్తువులను దీసికొని హరిశాస్త్రులు వెళ్ళిపోయెను. ఆమఱుచటిదినము మొదలుకొని క్రమక్రమముగా రుక్మిణి జబ్బువదిలి యారోగ్యమును బొందసాగెను. తరువాత నాబ్రాహ్మణు డొకదినము రాగిరేకుమీదనొకప్రక్కను ఆంజనేయవిగ్రహమును బీజాక్షరములును రెండవ ప్రక్కను ఎటుకూడినను ముప్పదినాలుగు వచ్చునట్లుగా బదునాఱు గదులుగల యీక్రిందనున్నరీతి యంత్రమును వేసి, ఆ రక్షరేకును