- రాజశేఖర చరిత్రము
తాయెతులో బెట్టి దండ చేతికి గట్టుమని చెప్పి యొక రూపాయ పుచ్చుకొని పోయెను. ఆ ప్రకారముగా మాణిక్యాంబ రుక్మిణి దిగదుడుపు పెట్టెనుగాని యందువలనను గార్య మగపడలేదు . ఒక దిన మున సుబ్బమ్మ కావేశము వచ్చి వేంకటేశ్వరులు బయలబడి యది యంతయు దన మహత్మ్యమే యనియు కొండకు వచ్చి తనకు నిలువు దోపిచ్చెద ననితల్లి మొక్కున్నపక్షమున సర్వము నివర్తియగు ననియు జెప్పెను. ఆ ప్రకారమే చేసెదనని మాణిక్యాంబ మ్రొక్కుకొని తన నగలలో నొకదానిని ముడుపుగట్టెను. గాని దాని వలనను రుక్మిణి దేహ స్ధితి యనుకూల దశకు రాలేదు .అంతట హరి శాస్త్రులు వచ్చి యీరాత్రి చిన్న దాని చేత బలికించి దయ్యమును వదల గొట్టేదనని ప్రతిజ్ఞ చేసి, తాను నాలుగు గడియల ప్రొద్దువేళ నే వచ్చి చావడి అలికించి దానినిండ రంగు మ్రుగ్గులతో ధైర్యశాలులయిన పురుషులు చూచినను భయపడు నట్టుగా వికృత మయిన స్త్రీ విగ్రహము న్నొకదానిని వేసి తాను స్నాననము చేసి జుట్టు విరియబోసికొని కుంకుమముతో మొగమంతయు నొకటే బొట్టు పెట్టుకొని, రుక్మిణిని స్నానము చేయించి తడిబట్టలతో న ట్టునడుమ గూరుచుండబెట్టి మొగమునకు విభూతి రాచి చుట్టును బిందె నాదములు మ్రోగునట్టు మనుష్యుల నియమించి, కన్నులు మిఱుమిట్లు గొన నెదుర గొప్ప దీపములు పెట్టించి, మంచి వారికి సహితము పైత్యోద్రేకము చేయు ధూపములు వేయుచు, చుట్టుపట్ల యిండ్ల లోని పిల్లలదఱును జడిసిగొనులాగున"హ్రం" "హ్రీం " అని పెద్ద గొంతుకతో బీజాక్షరముల నుచ్చరించుచు, గ్రుడ్లెఱ్ఱచేసి బెత్తముపుచ్చుకొని కొట్టబోయినట్టుగా రుక్మిణి మీదకి వెల్లి "ఉన్నది యున్నట్టుగా జెప్పు" మని కేకవేసెను. అవఱకే దేహస్మృతి తప్పి వికారముగా