పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆఱవ ప్రకరణము

ఈ స్దితి యంతయు కన్నులకు గట్టిన ట్లగపడి, ఆవర్తమానము తెలిసినదనినము మొదలుకొని రుక్మిణి రాత్రియు బగలును గదిలో నుండి వెలుపలికిరాక నిద్రాహారములు మాని మగనికయి శోకించుచు గృశింపసాగెను . విచారమునకుతోడు దేహముననేదియో వ్యాధి కూడ నాశ్రయించెను. ఆమె లేవలేనంత బలహీనురాలగు వఱకును వ్యాధిసంగతిని నెవ్వరును కనుగొన్నవారుగారు. కనుగొన్నతోడనే రాజశేఖరుదుగారు ఘనవైద్యుడని ప్రసిద్ధికెక్కిన జంగము బసవయ్యను పిలిపించిరి. అతడు రుక్మిణి పరున్నమంచము మీద గూరుచుండి యెడమచేయి పట్టుకొని నాడిని నిదానించి చూచి వాతనాడి విశేషముగా నాడుచున్నదనిచెప్పి, యామెకు బెక్కు దినములనుండి , శీతజ్వరము వచ్చుచున్నదనియు వెంటనే కనుగొనక పోవుటచేత జ్వరము దేహములో జీర్ణించిన దనియు జెప్పి వైద్య గ్రంధమునుండి -శ్లో పారాద్వారి మహాబలా త్రికటుకా జాజీరసోనా స్తధా ! విష్ణు క్రాసతినాడికా గృహభవోధూమ స్తులస్యాద్వయం నారంగస్య శలాటపత్ర మరలు త్వక్పత్ర నిర్గుడికా ! భార్గీపక్వ పట చ్చదాచ్చ సకలాన్ శీతజ్వరా న్నాశయేత్ - అను శ్లోకమును జదివి, తెప్పింపవలసిన వస్తువుల నొక కాగితముమీద వ్రాయించి యప్పటి కింటికి బోయెను. ఆమధ్యాహ్నమునకే రాజశేఖరుడు గారు వస్తువులనన్నింటిని దెప్పించి వైద్యునకు వర్తమానము నంపినందున, అతడువచ్చి వస్తువులను చూణముచేయించి పొట్లములు కట్టి, తేనె యనుపానముచేసి మూడువేళలను మూడుపొట్లములిమ్మని చెప్పి, నూనె, గుమ్మడి, బచ్చలి, పులుసు, కంద పనస మాత్రము తగుల గూడదని పధ్యమును విధించి , ప్రతిదినమును రెండు పర్యయములు వచ్చి చేయిచూచి గుణమును కట్టుకొని పోవుచుండును.