ఆఱవ ప్రకరణము
సొమ్ము పోయినందుకుమంత్రజ్ఞులు చేసిన తంతురుక్మిణిమగఁడు పోయిన వర్తనొకఁడు చెప్పుట. రుక్మిణికి రుగ్మ త వచ్చుట సోదె యగుట మగడుఁ పట్టుట భూతవైద్యము సువర్ణవిద్య బైరాగి సొమ్ముతో నదృశ్యుఁడగుట.</poem>
మఱునాఁడు ప్రాతఃకాలమున రాజశేఖరుఁడుగారు దంతధావనము చేసికొనుచు చీధియరుగుమీఁదఁ గూరుచుఁడియుండఁగా సిద్ధాంతి తంతోఁగూడ మఱియొక బ్రాహ్మణునిఁదీసికొని వచ్చియరుగుమీఁద నొకప్రక్కను చతికిలఁబడెను.చేతిలో వెండిపన్నువేసిన పేపబెత్తమును పట్టుకొని, తలయును గడ్డమును గోళ్ళును బెంచుకొని కనుబొమల సందున గొప్ప కుంకుమబొట్టు పెట్టుకొని గంభీరముగాఁ గూరుచున్న యీవిగ్రహమును నఖ శిఖపర్యంతమును తేఱిపాఱఁజూచి యాయన యెవరని రాజశేఖరుఁడుగారు సిద్ధాంతి నడిగిరి. "వీరు మహామంత్రవేత్తలు; మళయాళమునందుఁ గొంతకాలమునుండి మంత్ర రహస్యముల నామూలాగ్రముగా గ్రహించినారు; వీరిపేరు హరిశాస్త్రులవారు; వీరీవఱకు బహుస్థలములలో పోయినవస్తువుల నిమిషములో దెప్పించి యిచ్చిన్నార; వీరు నాలుగు సంవత్సరముల నుండివానప్రస్థాశ్రమమును స్వీకరించి యున్నారు." అని తా నాతనిని రెండుదినముల నుండియే యెఱిగినవాఁడయినను జన్మదినము నుండియు నెఱిఁగియున్నవానివలె నాతని చరిత్రమును చెప్పి, 'నఖగోమైర్వనాశ్రమీ' యను దక్షస్మృతి వచనమును జదివి గోళ్ళును వెండ్రుకలును బెంచు కొనుటచే వానప్రస్థుఁడగునని తల్లక్షణమును జెప్పెను. అప్పుడు హరిశాస్త్రులు తనమంత్రసామర్ధ్యమును గొంతసేపు పొగడుకొని