పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాఘ - తమయనుగ్రహముండగా ఉత్సవములకేమిలోపము ? నిరుడు పుష్యమాసములో సంక్రాంతినాటి యుత్సవము ప్రత్యేకముగా తమ ద్రవ్యముతో జరిగినది. నిన్ననో మొన్ననోలాగున కనబడుచున్నది; అప్పుడే సంవత్సర మయినది. రేపే సంక్రాంతి - ఈసంగతి తమతో మనవిచేయుటకే వచ్చి సుబ్బమ్మగారికి జబ్బుగా నున్నందున సమయముకాదని యూరకున్నాను.

రాజ - క్రిందటి సంవత్సరము నూటయేబది రూపాయల నిచ్చినాను. ఈసంవత్సరము మాలోపల వివాహములు తటస్థమయినవి గనుక నూఱురూపాయలనుమాత్రమే యిచ్చెదను. ఏలాగున నయిన దానితో సరిపెట్టవలెను.

రాఘ - చిత్తము. దానికేమి? ఆలాగుననే చేసెదను.

రాజ - రాఘవాచార్యులూ! బైరాగి నవస్యముగా నేడే మాయింటికి తీసికొనివచ్చి నీవు మఱియొకపనిని చేసుకోవలెనుజుమీ? ప్రొద్దెక్కు చున్నది. శీఘ్రముగా వెళ్ళు - సిద్ధాంతిగారూ! మీకు సందేహముగా నున్నపక్షమున శంకరయ్యజాతకము మఱియొకసారి చూడుండి; ఎవరితోనైనా నాలోచించవలసి యున్న యడల, లచ్చయ్య శాస్త్రిగారికి కూడ ఆజాతకము చూపవచ్చును.

సిద్ధాంతి - చిత్తము. నా కటువంటి సందేహము లేదు.

రాజ - అట్లయిన, ఇప్పుడు బసకు పోయి తరువాత దర్శన మిండి.

అని చెప్పి పంపినతరువాత సభ వారందఱును తమయిండ్లకు బోయిరి. రాజశేఖరుడుగారు భోజనము చేసి చేయి కడుగుకొను నప్పటికి రాఘవాచార్యు లాభైరాగిని వెంట బెట్టుకొనివచ్చి యింట బ్రవేశ పెట్టెను. నిత్యమును రాజశేఖరుడుగా రాతనికి సకలోప