పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లు తొందరపెట్టినందున, రాజశేఖరుడుగారు తన సొంతసొమ్ములో నుండి అప్పుడప్పుడు మూడువేల రూపాయలవఱకు నిచ్చి యాతనిని ఋణబాధనుండి విముక్తునిజేసిరి. రెండుసంవత్సరముల క్రిందట నారయణమూర్తి యొక్క పెత్తండ్రిభార్య సంతులేకుండ మృతినొందినందున , ఆమె సొత్తు పదివేలు రూపాయలు అతనికి జేరెను. ఆ సంగతి తెలిపినతొడనే రాజశేఖరుడుగారు పారమానందభరితులై నారాయణమూర్తి యింటికి బోయి యాతని నాలింగనము చెసికొని తనకీయవలసిన యప్పును దీర్పవలసినపని లేదనియు యావద్ధనముతోను గౌరవముతో సుఖజీవనము చేయవలసినదనియు జెప్పి యాదరించిరి. రాజశేఖరుడుగారి కీవఱకు బదులు చేయవలసిన యవస్యకమంతగా తట స్దింపనందునను , ధనము విశేషముగ నున్నందునను నారాయణమూర్తి కావలసినయెడల తనధనమును వాడుకోవచ్చునని రాజశేఖరుడుగారితో బలుమారు పూర్వము చెప్పుచు వచ్చెను.


ఒకనాడు నాలుగు గుడిల ప్రొద్దెక్కిన తరువాత రాజశేఖరుడు గారు కచేరిచావడిలో బలువురతో గూరుచుండియున్న సమయమున రుక్మిణి నూతి వద్దకువచ్చి యక్కడనుండి పెరటి గుమ్మము దగ్గఱకు బోయి లోపలనేనిలుచుండి, తరిగిన గుమ్మడికాయ పెచ్చులను వీధిలో బాఱవేయవచ్చినన పొరిగింటివారి యాడుపడుచుతో మాటాడుచుండెను . అప్పుడు చెతితో తాటాకు గిలకగుత్తుల నాడించుచు నెత్తిమీద నొకబొట్టుపెట్టుకొని యొక్క యెఱుగత యామార్గమున బోవుచు రుక్మిణి మొగమువంక నిదానించి చూచి నిలువబడి "అమ్మా! నీకు శీఘ్రముగానే మేలు కలుగుచున్నది; భాగ్యము కలుగుచున్నది. నీ మనసులో నొక విచారము పెట్టుకొని కృశించుచున్నావు. ఎఱుక యడిగితే నీ మనసులో నున్నది సూటిగా జెప్పెద" నని చెప్పెను .