పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీపరబ్రహ్మణేనమః

పీఠిక.

చ. సిరియొక యింత చేకుఱుటచేతనె మత్తిలి ముందు కీడుమే
ళ్ళరసెడివాఁ డొకండు గలఁడంచుఁ దలంపక పెక్కుదోసముల్
జరపెడి వారినేన్ దగుదొసంగిడి పిమ్మటఁ బ్రోచువేల్పు దా
సరగున నేలుఁ గాత గురుసామిని వెంకట సుబ్బరాయనిన్.

సీ. ఏవాఁడు జగముల నెల్లను నొక్కటఁ దలఁపులోననే తాను గలుగఁ జేయు
నెవ్వాఁడుకనఁబడ కల్లచోటులనుండి యన్నింటిననయంబు నరసిప్రోచు
నెవ్వాని యిచ్చమై నెల్లమైతాల్పులు దివికినేగుదురు బొందిగమిఁ బాసి
యెవ్వఁడు నెఱిఁదప్ప కెపుడునుండెడి వారికెన్నఁడుఁదఱుఁగనియెలమిఁ గూర్చు
నట్టివేలుపువాకొన నలవిగాని కనికరంబున నెనలేని కలిమి యొసఁగి
రమణఁ గొల్ల వేంకట సుబ్బరాయ సెట్టి నతనితమ్మునిగురుసామినరయు గాతే.

క. బటువు జగమ్ములఁ గలయ, న్నిటికిని దొరయైన యట్టి నెఱవేలుపు వేం కటసుబ్బ రాయసెట్టిని, దిటవుగ గురుసామిసెట్టిఁ దిరముగమనుచున్.

సీ. ఏ వారియింటి పేరిజ్జగంబునఁదొల్లి గుఱ్ఱము వారిని కుదిరియుండి
కొల్లగా రోయీవిఁగోరు వారలఁదన్ప గడను గొల్లావారుగాఁగ మాఱె
నెవ్వారి తాత పేరెన్నికకును నెక్కి సుబ్బరాయలు సెట్టి సొబగుమీఱె
మివుల సరివారిలోనగారవఁగాంచి. యెసఁగినట్టి వేంకయ సెట్టి యెవరి తండ్రి యట్టివేంకట సుబ్బరాయలునుదమ్ముఁ, డై నగురుసామిసెట్టి యునలరుచుండ్రు.

చ. అడవిమెగంబు లందమగునట్టి పులుంగులు నున్నతోఁటయె
క్కడ ఁ గనువారివేడ్కకయి కన్నుల పండువు గాఁగఁ గనుండునే
కడఁ బలువింతలెల్లఁ జనికాంచెడి వారికిఁ గాఁగఁ గూరుసం
బడిన వెడందసాల చెలువంబగుఁ జూపఱకున్న విందుగాన్.
 
ఉ. ఎక్కడఁ గూడి నాయములనేవురు తీర్చెడు గొప్పకొల్వు వే
ఱెక్కడనీడులేక తగు నెక్కడఁ బిల్లలకన్ని విద్దెలుం
జక్కఁగ నేర్పి తేఱుసఁగఁ జాలిన విద్దెల సాలయొప్పుఁదా
నెక్కడ గొప్పకోట యొకఁడింపగు దండులు నిండియుండఁగన్.