పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాఘ - తాతగారూ ! మీకు రాజశేఖరుఁడుగా రెటువంటి బంధువులు‽

ప్రసా - ఇప్పుడు మావాని బంధుత్వము విన్నారుగదా ? వీని మేనమామ బావమఱది నాకుమా ర్తెయత్తగారి సవతితమ్ముఁడు.

ఈ ప్రకారముగా సంభాషణము జరుగుచుండగా లోపలినుండి స్త్రీకంఠముతో సీతా! సీతా!" అని రెండుమూడు పిలుపులు వినబడినవి. అప్పుడు రాఘవాచార్యు లందుకొని, "అమ్మాయీ సీతమ్మా" అని పిలిచి లోపల అమ్మగా రెందులకో పిలుచుచున్నారు. అని చెప్పెను. అప్పుడు నూతివైపు పంచపాళిలో దన యీడుపడుచులతో గూడి గవ్వలాడుచున్న యేడుసంవత్సరముల యీడు గల చామనచాయపిల్ల పరికిణి కట్టుకొని కుడిచేతిలో పందెమువేయు గవ్వలను ఎడమచేతిలో గళ్ళుగీచినసుద్దకొమ్మును బట్టుకొని 'వచ్చె వచ్చె' నని కేకలువేయుచు కాళ్ళగజ్జెలు గల్లుగల్లుమన చావడిలోనుండి పడమటింటి గుమ్మమువైపునకు బరిగెత్తుకొని వెళ్ళెను. ఆచిన్నది రాజశేఖరుడుగారి రెండవకుమార్తె. అట్లువెళ్ళి గుమ్మమున కీవలనే నిలుచుండి సీత - 'అమ్మా ! ఎందుకుపిలిచినావు?'

మాణిక్యాంబ - నాన్న గారితో వంటయినదని స్నానమునకు లేవచ్చు నని చెప్పు.

మాణిక్యాంబ రాజశేఖరుడుగారి భార్య. ఆమె రుక్మిణితో సమానమయిన తెలివి గలదియు విద్య నేర్చినదియు గాకపోయినను, గృహకృత్యములను జక్క పెట్టుటయందును పాకము చేయుట యందును నిరుపమాన మయిన ప్రజ్ఞ కలది; రూపమున చాలవఱకు పెద్దకుమార్తెను పోలియుండునుగాని మొగము కొంచెము ముదురుది గాను దేహచ్ఛాయ యొకవాసి నలుపుగాను కనబడును. ఆమె