పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము

రాఘ-తమరు ప్రతిమాసమును దయచేయించెడి రూపాయలును బాలభోగమునకు జాలకున్నవి. ఇప్పుడుస్వాము లధికముగా వచ్చుచున్నారు.నందాదీపము క్రిందఁదమరు దయచేయు రూపాయతో మఱియొక రూపాయను జేర్చి యొకరీతిగా జరుపుకొనివచ్చుచున్నారు కాని నందాదీపములో మఱియొకరికి భాగముండుట నాకిష్టములేదు. స్వామికి బొత్తిగా వాహనములులేవు; పొన్నవాహన మొక్కటి యుండెనా రేపటి యద్యయనోత్సవములో నెంతయైన నిండుగానుండును. అది యీయేటికిఁగాకపోయిన మీఁదటికైనను మీకేదక్కవలెను. ముందుగా చెవిని వేసియుండిన నెందున కయినను మంచిదని మీతోమనవిచేసినాను.


రాజ-మొన్న దేవాలయములో స్వాములలో స్వాములేమో పొట్లాడినారట.


రాఘ-ద్వారకాతిరుమల నుండి వచ్చినస్వామి సాపాటుచేసి కూర్చుండి యుండగా, పెంటపాడు నుండి వేంచేసినస్వామి పెరుమాళ్ళ సేవచేసి వచ్చి కూర్చున్నరు.వారిద్దరిలో నొకరు తెంగలెవారును ఒకరు వడహలెవారును గనుక, నామముక్రింద పాద ముంచవచ్చును కూడదని మాట పట్టింపులు పట్టుకున్నారు.

రాజ-ఊరకే మాటలతో సరిపోయినదా?

రాఘ-తరువాతఁగొంచెము చేయిచేయి కలసినదిగాని ముదర నీయక నేనును నాతమ్ముడును అడ్డమువెళ్ళి నివారించినాము.

రాజ-మన జనార్దనస్వామివారి కేమాత్రము మాన్యమున్నది?

రాఘ- ఏడుపుట్ల మాన్య మున్నందురుగాని, అయిదుపుట్లు మాత్రము భోగమువాండ్రక్రింద జరుగుచున్నది. తక్కిన రెండుపుట్ల భూమియు అర్చకులది గాని స్వామిది కాదు.