పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/366

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లంతలేసియుండి నాదృష్టికి నడగొండవలె గానబడినవి. ఉత్సవ విగ్రహములను దేవాలయములలోని యర్చకులు మోసికొని పోవునట్లుగా నా యజమానుని సేవకులు నన్ను తమచేతులతో గొనిపోయి యాళకటమునందు గూరుచుండ బెట్టగా, భయముచేత నిశ్చేష్టుడనయి దేవాలయములోని పీఠముమీద జీవుడు కూర్చున్నట్లుగా భూదేవుడనైన నేనును కదలమెదలక యందలి మెత్తమీద గూరుచున్నను. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని నేను ముందు చూచునప్పటికి గుఱ్ఱములుబండి నీడ్చుకొని వాయువేగమున బరుగెత్తుచుండినవి; బండిచక్రముల చప్పుడు మేఘగర్జనవలె చెవులు చిల్లులు వోవునట్లు కర్ణకఠోరముగా వినబడ జొచ్చినది. ఈయవస్థలో గాలిలోబెట్టిన దీపమువలె వెనుకకును ముందునకును బండికుదుపుచేత నూగులాడుచు ప్రాణములు బిగబట్టుకొని మెత్తగా బట్టుకొని యరగంటసేపు గూరుచుండు నప్పటికి సభమందిరము సమీపించి నందున బండి నిలిచినది. అప్పుడు మహాకాయుడుగారు బండి దిగి సభాగృద్వారము వద్దకి నడవగా వెనుకనుండి భృత్యులు తదాజ్ఞానుసారముగా నన్ను గొని వచ్చి యాయన చేతి కందిచ్చిరి. నావంటి యల్పుని దమవంటి ఘనులు మోచుట ధర్మము కాదని నేనాయనతో నా వినయ విధేయతలు తేటపడునట్లుగా మనవిచేసి నన్ను మఱియొకరి చేతికియ్యవలసినదని ప్రాధికాంచినను, ఆయన నాప్రార్ధన నంగీకరింపక నీచసేవకులు సభాభవనము లోనికి బోగూడదను హేతువుచేత గాబోలును నన్ను వ్యయముగానే చేతులతో నెత్తుకొనిపోయి ధర్మాధికారిగారు చూసిన పీఠముమీద దాను గూరుచుండి నన్ను తన ప్రక్కను గూరుచుండబెట్టు కొనెను. మేమక్కడకు బోవునప్పటికే సభాస్తారులందఱును వచ్చి తమ కర్హములయిన పీఠముల మీద నాసీనులయి యుండగా,