పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
లంకా ద్వీపము
దేశయాత్రలు నిషేధించిన దూరదృష్టి యొక్క మహిమ నామనస్సునకు బోధపడి వారిసర్వజ్నత స్పష్టపడినది. ఆహా ! మన పూర్వులను బోలిన ధీమంతు లిప్పుడున్న వారిలోను ముందు పుట్టఁబోవువారిలోను కూడ నుండరు. అప్పుడు మనపెద్దలబుద్ధిని మెచ్చుకొనుచు వారి యందు పూజ్యతాబుద్ధి కలవాఁడనయి నాభాగ్యమింతే యని యెంచుకొని పెద్దలు నిషేధించిన ద్వీపాంతరయానమునకు పూనినపాపఫల మనుభవింపక తీఱదని నిశ్చయము చేసుకొని, వడవడ వడఁకుచు ప్రాణములమీది యాశ వదలుకొని ఈశ్వరనామస్మరణము చేసికొనుచు చెట్టుక్రింద నిలువుఁబడి యుంటిని. ఇట్లుండగా గాలిచేత మఱిపండొకటి నాకాలిసమీపమున రాలి కుండపగిలినట్లు బళ్ళున పగిలినది. ఈశ్వర కటాక్షముచేత పండు కొంచెము దూరముగా పడినదికాని నానెత్తిమీఁదనే పడినపక్షమున తల రెండు ప్రక్కలయి మీకీవృత్తాంతమును చెప్పువారులేక నేనీపాటికి స్వర్గలోకమున ప్రాతకాపునయి యుండి యుందును. ఈనాయాపదల కన్నీటికిని హూణులు చేసిన భూగోళశాస్త్రాము మూలము. వారి శాస్త్రాములను వేనిని నమ్మినవాఁడనయినను వారు దేశములను తిరిగి చూచివచ్చి సత్యము వ్రాసినారన్న విశ్వాసము చేత లంక యనఁగా నాకుచెప్పినట్లు సింహళ ద్వీపమనియు, అక్కడ మనవంటి మనుష్యులే యున్నారనియు, వారు వ్రాసిన వ్రాఁతలు నమ్మి భ్రమపడి మోసపోయి యీయాపదలను తెచ్చుకున్నాను. కాని సత్యమునకు లంకయనఁగా సింహళద్వీపము కాదు సుండీ. అదివాఱు ; ఇదివేఱు. ఈరెంటికిని గలభేధమును గూర్చి మీకు ముందు ప్రకరణమునందుఁ దెలిపెను. మహారణ్యమధ్యమున నేనిట్లు భయభ్రాంతుఁడనయి యున్న సమయములో గోరుచుట్టుమీఁద రోకటి పోటు పడ్డట్టు మఱియొకవిత్తుకూడ సంప్రాప్తమైనది. దిగ్ర్భమనొంది నేను దిక్కులు చూచుచుండగా నిరువదిముప్పది యడుగుల యెత్తు